ఒక్క టోకెన్ సామీ !
యూరియా రైతులను కుంగదీస్తోంది. టోకెన్ల కోసం పరుగులు పెట్టిస్తోంది. గంటలోపే టోకెన్లు అందక కన్నీళ్లు పెట్టిస్తోంది. క్యూకట్టి...వెన్ను విరిచేస్తోంది. తిండి తిప్పలు లేక పడిగాపులు పడుతున్నారు. ఇదీ చాలదన్నట్లు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పస్తులతో యూరియా కోసం అలమటిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
చిత్తూరు నగరంలోని సహకార మార్కెటింగ్ సొసైటీ భవనం వద్ద గుమికూడిన రైతులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలో శనివారం యూరియా పంపిణీ చేశారు. మళ్లీ మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకె న్లు పంపిణీ చేశారు. ఇందుకు ముందుగానే చిత్తూ రు నగర పరిసర ప్రాంతాల్లోని రైతులు వందలాదిగా క్యూకట్టారు. ఉదయం 8గంటలకే కార్యాలయాన్ని చుట్టిముట్టేశారు. రైతులు అధిక సంఖ్యలో అక్కడికి రావడంతో గందరగోళంగా కనిపించింది. గంటల్లోనే టోకన్లు అమ్ముడుపోవడంతో చాలా మంది రైతులు నిరాశకు లోనయ్యారు.
బతిమిలాడుతున్నా..
వందలాదిగా వచ్చిన రైతుల్లో కొంత మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయి. మిగిలిన రైతులను సోమవారానికి రమ్మని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత వచ్చిన వారికి టోకెన్లు లేవని తిప్పి పంపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు మాత్రం అల్లాడిపోయారు. అధికారులను ఒక్క టోకెన్ సామి అని బతిమిలాడుకున్నారు. వారిని అధికారులు.. మీ ఊళ్లోనే ఇస్తారని సర్ధిచెప్పి పంపించేశారు. ఇక టోకెన్లు అందిన వారికి కూడా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది.
నిల్వలు ఇవీ
జిల్లాలో ప్రస్తుతం 324 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. 108 ఆర్బీకేలో 84 మెట్రిక్ టన్నులు, 7 సహకార సొసైటీలో 40 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు దుకాణాల్లో 200 టన్నులు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వీటిని రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.
గంటల తరబడి పడిగాపులు
చిత్తూరు నగరంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడకు ఉదయం 8గంటలకు వచ్చి క్యూలో నిలబడుతున్నారు. టోకెన్లు దొరకవని పొద్దు..పొద్దునే వచ్చేస్తున్నారు. కార్యాలయం వద్ద గంట నుంచి..రెండు గంటల సమయం తర్వాత టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. అక్కడ టోకెన్లు తీసుకుని గాంధీ రోడ్డులోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ భవనం వద్దకు నడిచి వెళ్లాలంటే అర గంట సమయం పడుతుంది. ఇంతలో రైతులు నీరసించిపోతున్నారు. యూరియా తీసుకోవాలంటే క్యూలో నిలబడి తల్లడిల్లిపోతున్నారు. బయోమెట్రిక్ వేసి..యూరియా బ్యాగు తీసుకుని బయటకు రావడానికి రెండు గంటల సమయం పడుతోంది. దీంతో రైతులు సొమ్మ సిల్లిపోతున్నారు. అధికారులు స్పందించి ఈ కష్టాల నుంచి విముక్తి కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
యూరియాకు..రెండు కి.మీ...
యూరియాకు టోకెన్లు అందిన రైతులు కూడా మండిపాటుకు గురవుతున్నారు. ఆఫీసులో టోకెన్లు ఇస్తే..రెండు కి.మీ దూరం వెళ్లి యూరియా తెచ్చుకోవాలా అంటూ మండిపడుతున్నారు. రైతులను ఇలా ఇబ్బంది పెట్టించడం కరెక్టు కాదని ఆగ్రహానికి గురవుతున్నారు. యూరియా పంపిణీ చేసే చోటే..టోకెన్లు పంపిణే చేస్తే బాగుంటుందని, ఈ విషయంలో కలెక్టర్, పాలకులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరీక్షణ లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే యూరియా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని నివేదిస్తున్నారు.
ఒక్క టోకెన్ సామీ !


