రాజనాలబండ.. నిజాయితీకి అండ
చౌడేపల్లె : సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయ స్వామి పేరు చెప్పగా చోరీ చేసిన సుమారు 150 గ్రాముల బరువు గల నగలు ఇంటి ముందు ప్రత్యక్షమైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చౌడేపల్లె మండలం వెంగళపల్లె పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన గిరిబాబు ఇంటి బీరువాలో దాచిన బంగారు నగలను గతనెల 25వ తేదీ చోరీ అయ్యాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో ఏర్పాటు చేసిన పంచాయతీకి ఇంటికొకరు చొప్పున హాజరయ్యారు. చోరీ సంఘటన గురించి ఆరా తీశారు. నేరం అంగీకరించకపోవడంతో ఈనెల 3న శనివారం ప్రతి ఇంటిలోని ఒకరు రాజనాలబండకు చేరుకొని ప్రమాణం చేయాలని తీర్మానించారు. ఇంతలో శనివారం ఉదయం చోరీ అయిన బంగారు నగల మూట ఇంటి ఆవరణలో ప్రత్యక్షం కావడంతో కథ సుఖాంతమైంది. అనంతరం టెంపుల్ ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్,, అర్చకుడు కష్ణమూర్తి పూజలు చేసి బాధితులకు బంగారు నగలు అందజేశారు.


