విధులకెళ్లి.. విగత జీవివయ్యావా తల్లీ!
పూతలపట్టు( యాదమరి): ‘పండు..డ్యూటీకి వెళ్తున్నా.. రేపు ఇంటికి రాగానే చిత్తూరులో షాపింగ్‌కు వెళ్దాం. అక్కడ నీకేమి కావాలో తీసిస్తా..’ అని చెప్పి విధులకు వెళ్లావు కదమ్మా.. ఇప్పుడు విగత జీవిగా మారావా తల్లీ అంటూ ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు .. పెనుమూరు మండలం, గుత్తావాండ్ల వూరు గ్రామానికి చెందిన వెంకటేష్‌నాయుడు భార్య గాయత్రి(30) పూతలపట్టు మండలం, పేటమిట్టలో ఓ కర్మాగారంలో విధులు నిర్వర్తిస్తోంది. బుధవారం యథావిధిగా విధులకు హాజరైంది. రాత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో తన సహచర ఉద్యోగినులతో పాటు స్వగ్రామానికి బయల్దేరింది. రంగంపేట క్రాస్ వద్ద పీలేరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఐషర్ వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న గాయత్రితో పాటు.. మౌనిక, జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు గాయత్రి మార్గమధ్యంలో మృతి చెందింది. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూతలపట్టు సీఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. కుటుంబ పోషణ కోసం విధులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా.. అమ్మా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.


