ప్రజలు క్షమించరు బాబూ!
చిత్తూరు రూరల్(కాణిపాకం): మెడికల్ కళాశాలలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు క్షమించరని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీ వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే 107, 108 జీవోలను రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలంన్నిటినీ నిర్వహిస్తామని మంగళగిరి పాద యాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజారోగ్య రంగాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని పది నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం జీ.వో నెంబర్ 590ని జారీ చేసినట్టు తెలిపారు. వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. నాయకులు గోపీనాథ్, మణి, దాసరి, చంద్ర, విజయగౌరీ, రమాదేవి, పెద్దరెడ్డి కవిత, జబిలబి, కుమారి, కోమల, బాలాజీరావు, లతారెడ్డి, గుర్రప్ప, రఘు, మునిరత్నం ఫైరోజ్, ప్రవీణ్‌కుమార్, వసంత్, రమ్య, చైతన్యశ్రీ, భార్గవ్ పాల్గొన్నారు.


