గుట్టుగా మెరిట్ లిస్ట్?
ఉన్నతాధికారుల అనుమతి లేకుండా దరఖాస్తుల ఆహ్వానం తర్జనభర్జన మధ్య సాగిన స్క్రూట్నీ ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ విడుదల లోలోపల ఫైనల్ మెరిట్ లిస్టు సిద్ధం! నేడు కలెక్టర్‌కు చేరనున్న తుది జాబితా పోస్టుల భర్తీపై ఎన్నో అనుమానాలు
కాణిపాకం: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అనుమతుల్లేకుండా ఎన్‌హెచ్‌ఎం పోస్టుల భర్తీకి జిల్లా అధికారులు దరఖాస్తులు ఆహ్వనించారు. ఆపై స్క్రూట్నీ ప్రక్రియ తర్జన భర్జన నడుమ సాగించారు. తీరా కొన్ని పోస్టులకు మాత్రమే రాష్ట్ర శాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో ఎన్‌హెచ్‌ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ గుట్టుగా జరిపిస్తున్నారు. ప్రొవిజన్‌ల్ మెరిట్‌లిస్టు జాబితాను ఆన్‌లైన్‌లో గోప్యంగా ఉంచారు. ఫైనల్ మెరిట్ లిస్టును గురువారం రాత్రికి పూర్తి చేశారు. ఆ ఫైల్‌ను శుక్రవారం కలెక్టర్ ముందు ఉంచనున్నారు. ఈ భర్తీపై అభ్యర్థుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఎన్‌హెచ్‌ఎం పోస్టులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అక్టోబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. మెడికల్ ఆఫీసర్ 13 పోస్టులు, స్టాఫ్ నర్సు 20 పోస్టులు, ఫైన్సాన్స్ కమ్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్ –1, ల్యాబ్ టెక్నీషియన్ –3, ఫిజియోథెరపిస్ట్– 1, ఆడియో మెట్రిషియన్– 2, శానిటరీ అటెండర్– 2, సపోర్టింగ్ స్టాఫ్– 4, సెక్యూరిటీ గార్డు –2, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్– 8 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు గాను మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చాయి.
గోప్యమెందుకో?
వచ్చిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నెల రోజులపాటు స్క్రూట్నీ చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు స్క్రూట్నీ ప్రక్రియను ముగించారు. 9వ తేదీ రాత్రి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టారు. అయితే ఆ జాబితాను బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. మీడియా, ఆ శాఖలోని పలువురు అధికారులకు కూడా తెలియకుండా ప్రొవిజనల్ మెరిట్‌లిస్టును నడిపించారు. ఈ నెల 14 వరకు అభ్యంతరాల స్వీకరణ చేయగా.. 18వ తేదీ రాత్రికి ఫైనల్ మెరిట్ లిస్టు సిద్ధం చేశారు. శుక్రవారం ఈ ఫైల్‌ను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లనున్నారు. అయితే ప్రొవిజన్ మెరిట్ లిస్టు ఆన్‌లైన్‌లో ఉంచిన విషయాన్ని గుర్తించలేకపోయామని పలువురు అభ్యర్థులు మదన పడుతున్నారు. పత్రిక ప్రకటన లేకుండా ఆన్‌లైన్‌లో ఎలా ఉంచారని వారు ప్రశ్నిస్తున్నారు.
సిఫార్సు లేఖలకు తలొంచారా?
ఎన్‌హెచ్‌ఎం పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం నుంచి సిఫార్సు లేఖలు 500పైగా సిఫార్సు లేఖలు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ లేఖలకు అధికారులు తలొంచారా.. లేదా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్నాయి. రెండు జిల్లాల్లో ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖకు ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నిజమైతే పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారే అవకాశాలున్నాయి.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఎన్‌హెచ్‌ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అభ్యర్థుల్లో అనుమానాలు
పోస్టుల భర్తీ విషయంలో ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రాష్ట్ర శాఖ అనుమతి తీసుకోలేదు. దరఖాస్తులు ఆహ్వానించిన విషయం పై అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. ఆపై ఫైల్‌ను తీసుకుని విజయవాడకు పరుగులు పెట్టారు. జిల్లా అధికారుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. చాలా పోస్టుల భర్తీపై కోతలు పెట్టారు. కొన్ని పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతులిచ్చారు. ఆ పెండింగ్ వివరాలను కూడా శాఖ అధికారులు ఇంతవరకు బయట పెట్టలేదు. కోటి ఆశాలతో దరఖాస్తు చేసుకుంటే.. ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


