చట్టాన్ని వినియోగించుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్: వినియోగదారులు హక్కు ల పరిరక్షణ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. గురువారం నగరంలోని ఎన్‌పీఎస్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర, పరిష్కారం’ అంశంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ నష్టం జరిగినప్పుడు నేరుగా వినియోగదారుడే రూ.5లక్షల వరకు ఫీజు లేకుండా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చనన్నారు. నాణ్యత ప్రమాణాలులేని వస్తువులు, సేవా సంస్థల లోపంతో నష్టం వాటిలినప్పుడు ప్రశ్నించేతత్వం ఉండాలని ఏపీ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు రాజారెడ్డి తెలిపారు. మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఉషాదేవి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019 విశిష్టమైందన్నారు. ఆన్‌లైన్ వ్యాపారంలో కూడా నష్టం జరుగుతోందని, వాటి పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, కళాశాల వినియోగదారుల క్లబ్ కో–ఆర్డినేటర్ రమాదేవి, ఫోరం సభ్యుడు సలీం పాల్గొన్నారు.


