సమరశంఖమై!
చంద్రబాబు నిర్ణయంపై గళమిప్పిన యువత తల్లిదండ్రుల నుంచీ అనూహ్య స్పందన జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా సంతకాలు చేసిన వైనం జిల్లాలో 4.31 లక్షలు దాటిన విద్యార్థుల సంతకాలు
సంతకమే..
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువత, విద్యార్థులు చంద్రబాబు సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు లక్షలాది మంది మద్దతుగా నిలిచారు. అన్ని వర్గాలతో పాటు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి చంద్రబాబు సర్కార్ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులే దాదాపు... లక్షల మంది సంతకాలు చేశారంటే చంద్రబాబు సర్కారుపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన కూటమి సర్కార్‌పై సమరశంకం పూరించారు. వైద్య విద్యను గ్రామీణ, పట్టణ, పేద విద్యా ర్థులకు అందని ద్రాక్షగా మార్చేందుకు కుట్ర చేపన్నుతున్నారని మండిపడ్డారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన వెల్లువ
పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత
జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థులు పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. అప్పట్లోనే వీటి నిర్మాణానికి రూ.8500 కోట్లు వెచ్చించారు. అందులో మూడు వేల కోట్ల మేర ఖర్చుచేసి ఐదు మెడికల్ కళాశాలను ప్రారంభించారు. వందల సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు ప్రారంభమైన కళాశాలల్లో వైద్య విద్యనభ్యసిస్తున్నారు. మరో 12 వైద్య కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్ని పూర్తి కావొచ్చాయి. అయితే చంద్రబాబు సర్కారు వాటి నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా పీపీపీకి మొగ్గు చూపుతోంది. పీపీపీ విధానంతో ప్రైవేట్‌కు అప్పగించడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విధానాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైద్య సీట్లు వద్దంటూ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడంపై భగ్గుమంటోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైద్య కళాశాలలను నిర్వీర్యం చేస్తోందని పెదవి విరుస్తోంది.


