అవగాహన లోపం.. ప్రజలకు కన్నీటి శాపం!
నక్కబండలో తాగునీటికి కటకట
పుంగనూరు: అధికారుల అలసత్వం కారణంగా పది రోజులుగా ప్రజలు తాగునీటి కోసం అల్లాడాల్సి వస్తోంది. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని నక్కబండ ఏరియాలో 1,550 కుటుంబాలున్నాయి. ఇక్కడ పైపులైన్ల మరమ్మతుల పేరుతో పబ్లిక్ కొళాయిలను పెరికేశారు. డబ్బు కడితేనే కొళాయిలు వేస్తామంటూ మున్సిపల్ అధికారులు, కొంత మంది చోటీ టీడీపీ తెగేసి చెబుతున్నారు. దీంతో స్థానికులు పది రోజులుగా సరిపడా నీళ్లులేక అల్లాడుతున్నారు. దీనిపై మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అంతమాత్రం ఆలోచించలేరా?
మండల పరిధిలోని నక్కబండను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోకి చేర్పించారు. 1,550 కుటుంబాలు కలిగిన నక్కబండలో ముస్లిం మైనార్టీలు, దళితులు అధి క సంఖ్యలో నివాసం ఉన్నారు. ఆ ప్రాంతంలో మంచినీటి సర ఫరా ఇబ్బందిగా ఉందంటూ ప్రజలు పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత పది రోజుల క్రితం నక్కబండలోని అన్ని పైపులైన్లను జేసీబీలతో తొలగించారు. కొత్త పైపులైన్లు వేసే కార్యక్రమం చేపట్టారు. ఒక్కొక్క ప్రాంతంలో మరమ్మతులు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలేదు. అన్ని వీధుల్లోని పైపులైన్లు, పబ్లిక్ కొళాయిలు పెరికివేశారు. దీంతో నీటి సమస్య తలెత్తింది.
డబ్బు కడితేనే కనెక్షన్
మున్సిపల్ అధికారులు కొళాయి కనెక్షన్‌కు ఒక్కొక్కరూ రూ.7,500 చెల్లించాలని, లేకపోతే మంచినీటి సరఫరా చేయలేమని తెగేసి చెప్పారు. తాము కూలీలమని, బీపీఎల్ పథకం కింద రూ.500 చెల్లిస్తామని చెప్పినా అధికారులకు మనసు కరగలేదు. దీని కారణంగా పది రోజులుగా ఆ ప్రాంతంలో మంచినీరు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
వైఎస్సార్‌సీపీ అభిమానులకు ఇబ్బందులు
నక్కబండ ప్రాంతంలో ముస్లిం, మైనారిటీలు, దళితుల్లో ఎక్కువభాగం వైఎస్సార్‌సీపీ అభిమానులే. మున్సిపల్ అధికారులు కావాలనే నక్కబండ వాసులను వేధిస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా పబ్లిక్ కొళాయిలను కూడా పెరికివేయడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడం, ఆ ప్రాంత వాసుల ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.
టీడీపీ చోటా నేతల దంద
నక్కబండ ప్రాంతంలో ఓ టీడీపీ చోటా నాయకుడు దంద చేస్తున్నాడని, ఇద్దరు ఫిట్టర్లను నియమించి, వారి వద్ద నుంచి ఇంటికి రూ.100 చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మున్సిపల్ చైర్మన్ చర్చలు
నక్కబండ ప్రాంతంలో తాగునీటి సమస్య ఏర్పడడంతో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా గురువారం కమిషనర్ మధుసూదన్‌రెడ్డితో పాటు ఆ ప్రాంత వాసులతో సమావేశమయ్యారు. అక్కడ ఉన్న పేదకూలీలందరికీ రూ.500తో కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ పరిశీలించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ అధికారుల ఓవర్ యాక్షన్ కారణంగా వందలాది కుటుంబాలకు తాగునీటి సమస్య ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
అవగాహన లోపం.. ప్రజలకు కన్నీటి శాపం!
అవగాహన లోపం.. ప్రజలకు కన్నీటి శాపం!


