ఈత తోపులో కబ్జాకు చంద్రోదయం!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం, తాళంబేడు పంచాయతీ ఈత తోపులో 16 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. దొడ్డి అనంతాపురం గ్రామానికి చెందిన ఓ నేత భూకబ్జాకు పాల్పడ్డాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చదును చేస్తున్నాడు. ఆ భూమిని కొనుగోలు చేసినట్లు ప్రచారం చేయించుకున్న ఆ నేతకు వ్యతిరేక ఓ వర్గం ఒక్కసారిగా చుక్కలు చూపించింది. భూ ఆక్రమణ విషయాన్ని బట్టబయలు చేయించింది. ‘సాక్షి’ దినపత్రికలో కూడా భూకబ్జాలో తోపు అనే పేరిట వార్తా ప్రచురి తమైంది. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుని వద్ద రాతపూర్వకంగా రాయించుకున్నారు. రోజంతా కార్యాలయంలో కూర్చొబెట్టారు. తీరా కొన్ని పంచాయితీలు నడవడంతో.. ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఇప్పుడు ఏం జరుగుతోందంటే?
ఆక్రమణ భూమి బహిర్గతం కావడంతో ఆ నేత కుమిలిపోయాడు. ఈ తరుణంలో ఓ మండల నేత చంద్రోదయంలా కనిపించడంతో ఆ నేత మళ్లీ రంగంలోకి దిగాడు. మండల నేత అండదండలు పుష్కలంగా ఉండడంతో భూ ఆక్రమణ విషయాన్ని ఆ నేత తెరపైకి తీసుకొచ్చాడు. ఆ ప్రభుత్వ భూమి, కాలువ భూమికి పట్టాలు ఇప్పించేందుకు భీష్మించుకుని కూర్చున్నాడు. ఈ విషయంలో ఓ ప్రజాప్రతినిధి అండగా ఉండారనే విషయాన్ని కబ్జాకు పాల్పడుతున్న వర్గం బహిరంగంగా చెబుతోంది. ఇందుకు రూ.లక్షల్లో చేతులు మారినట్లు కూటమి లోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. అలాగే స్థానిక పాలకులు, వ్యతిరేక వర్గ కూటమి నేతలు ఆక్రమణను అడ్డుకునేందుకు బయటపడకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఈ భూమికి పట్టాలు ఇచ్చేందుకు ఏ రకంగా సాహసం చేస్తారో చూడాలని వేచి చూస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.


