బాధిత కుటుంబానికి భరోసా!
ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు ఇల్లు కట్టివ్వాలి ఎమ్మెల్యే భానుకు కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలపై లేదు మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజం
పుత్తూరు: తడుకు పంచాయతీ వీఎస్‌ఎస్ పురంలో ఇల్లు కాలిపోయిన బాధిత వెంకటేష్ కుటుంబాన్ని తమ రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. శనివారం వీఎస్‌ఎస్‌పురం వెళ్లి బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం మీడి యాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. అధికారులతో మాట్లాడితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారన్నారు. వీఎస్‌ఎస్‌పురంలో ఎన్‌ఆర్‌జీఎస్ పనులు చేసిన గ్రామస్తులకు 16 వారాల పాటు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ వస్తువులు ఇంటి వద్దకే చేర్చేవారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెండు కిలో మీటర్లు నడిచి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి దాపురించిందన్నారు. ఇలా ప్రజలు కష్టాలు పడుతుంటే ఇక్కడి ఎమ్మెల్యే భాను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఆయనకు గంజాయి, ఇసుక, మట్టి, క్వారీల వద్ద కమీషన్లు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ, పేదల కష్టాల గురించి తెలుసుకునే తీరిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం, ఇంటి పట్టాలు, కొత్త ఇళ్లు, ఆసరా, చేయూత, సున్నావడ్డీ ఏదీ అమలు చేయడం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్‌కళ్యాణ్ అప్పులు చేస్తూ, దోచుకుంటూ, దాచుకొంకుంటున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు.
కామండింగ్ లేదా భాను!
ఇక్కడి ఎమ్మెల్యేకి అధికారులపై కమాండింగ్ లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని అలాగని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే కుదరదని తేల్చి చెప్పారు. ఇక్కడి మండల స్థాయి అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని, లేనిపక్షంలో పరిస్థితి సీరియస్ అవుతుందని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ హరి, ఎంపీపీ మునివేలు, వైఎస్సార్‌సీపీ రూరల్ మండల అధ్యక్షుడు అన్నాలోకనాథం, నాయకులు ప్రభురాజు, శ్రీనివాసులురెడ్డి, భాస్కర్‌యాదవ్, మురళీయాదవ్, గోపీయాదవ్, బొజ్జయ్య, లక్ష్మణమూర్తి, గంగాధరం, మస్తాన్, గిరిజాప్రసాద్, దేవేంద్రరెడ్డి, రామ్‌బత్తెయ్య పాల్గొన్నారు.
రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయూత


