అప్పుల బాధ తాళలేక యువకుడి ఆత్మహత్య
గుడుపల్లె: అప్పుల బాధ తాళలేక రాకే ష్(27) అనే యువకుడు శనివారం వే కువజామున రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. కుప్పం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్ కథనం మేరకు.. మండలంలోని గుడుపల్లె రైల్వేస్టేషన్ వద్ద కాపురం ఉన్న రాకేష్ కొన్ని నెలలుగా అప్పుల బాధతో మథనపడుతుండేవాడు. ఈ క్రమంలో గతంలో కూడా రెండు,మూడు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో రోజు రోజుకు అప్పులు బాధ ఎక్కువ కావడంతో భరించలేక ఉదయాన్నే గుడుపల్లె రైల్వే స్టేషన్ వద్ద చైన్నె నుంచి బెంగళూరు వెళ్లే కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. దీంతో రైలులో ఉన్న డ్రైవర్ సమీపంలోని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించి బంధువులకు సమాచారం అందజేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


