
సార్ చెప్పారు.. గిఫ్ట్ బాక్స్ ఇవ్వు!
చిత్తూరు కలెక్టరేట్ : దీపావళి రోజున టపాసులు కాల్చడం సంప్రదాయం. చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరులో తాత్కాలిక టపాసుల దుకాణాలు వెలిశాయి. వీటికి అనుమతులు పొందే సమయంలో ముడుపులతో పాటు అగ్నిమాపక, రెవెన్యూ, మరికొన్ని శాఖలకు గిఫ్ట్ బాక్సుల టపాసులు ఉచితంగా ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలా ఇవ్వని దుకాణాలకు వచ్చే పండుగకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదంటూ భయపెడుతున్నాడు. ఒక్కొక్క శాఖకు 50 నుంచి 200 వరకు గిఫ్ట్ బాక్సులు ఇవ్వాల్సి వస్తోందని, వారితో పాటు ప్రజాప్రతినిధులకు అదనంగా మరికొన్ని ఇవ్వాల్సి వస్తోందని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.
ఖరీదైన వెలుగుల పండుగ
జిల్లాలో టపాసుల దుకాణాల ఏర్పాటుకు రెవెన్యూ, అగ్నిమాపక, ఇతర శాఖలకు ఎప్పటిలాగే ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాపారం మూడు రోజులు మాత్రమే ఉంటుందని, అది కూడా వర్షం కురిస్తే ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క దుకాణం నుంచి రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోందని, ఈ ఖర్చులు మొత్తం చివరికి వినియోదారులపైనే నెడుతున్నామని వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇచ్చే ముడుపులను పూడ్చుకునేందుకు అదనపు రేట్లను పెడుతున్నట్టు వెల్లడిస్తున్నారు.
అందరికీ చెల్లింపులు
ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 36 వరకు టపాసుల దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రతి దుకాణం నుంచి రెవెన్యూ, అగ్నిమాపక, నగరపాలక శాఖలకు చెల్లింపులు చేయాల్సి వస్తోందని, అలాగే విద్యుత్, నీరు, భద్రతా సదుపాయాల పేరుతో అదనపు లెక్కలు చూపుతున్నారని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు లైసెన్సులు పొందిన వ్యాపారులు నష్టాలను భరించలేక తమ అనుమతులను తాత్కాలికంగా మరొకరికి రూ.30వేల నుంచి రూ.40 వేలకు విక్రయించినట్టు సమాచారం.
ధరలపై పర్యవేక్షణ కరువు
తాత్కాలిక దుకాణాల్లో అధిక ధరలకు టపాసులు విక్రయిస్తుంటే పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. నియంత్రించాల్సిన పలు శాఖల అధికారులు తమ జేబులు నింపుకుని.. గిఫ్ట్ బాక్సులు తీసుకుని పట్టించుకోకుండా ఉండిపోతున్నారనే విమర్శలున్నాయి.టపాసుల ధరలపై వినియోగదారులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని అధిక ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
చిత్తూరు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రామ్‌నగర్ కాలనీకి చెందిన అమర్ అనే నిరుద్యోగి తాత్కాలిక టపాసుల దుకాణం పెట్టాడు. ఈ దీనికోసం బ్యాంకులో రుణం తీసుకుని రూ.20 లక్షల వరకు వెచ్చించాడు. అగ్నిమాపక, రెవెన్యూ శాఖల్లో అనుమతులు పొందే సమయంలో లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందని, అంతటితో ఆగకుండా టపాసుల గిఫ్ట్ బాక్సులు అడుగుతున్నారని ఆవేదన చెందుతున్నాడు. అధికారులు ఒక్కొక్కరూ వచ్చి సార్ చెప్పారు.. 30 గిఫ్ట్ బాక్సులు ఇవ్వు.. అంటూ భయాందోళన సృష్టిస్తున్నారని వాపోతున్నాడు. వీరితోపాటు ప్రజాప్రతినిధులు సైతం గిఫ్ట్ బాక్సులు తమ ఇళ్లకు పంపాలంటున్నారని, ఇంత మందికి ఇచ్చుకుంటూ వెళితే అసలు కూడా వచ్చేలా లేదని ఆవేదన చెందుతున్నాడు.
చిత్తూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అరుణ్ తాత్కాలిక టపాసుల దుకాణం పెట్టాడు. అనుమతులు ఇచ్చిన శాఖలకు మామూళ్లతో పాటు 50 నుంచి 100 వరకు టపాసుల గిఫ్ట్ బాక్సులు పంపాల్సి వస్తోందని చెబుతున్నాడు. ఇవ్వకపోతే మరోసారి అనుమతులు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నాడు. తెచ్చిన స్టాక్‌లో అధిక శాతం ఉచితంగా పలు శాఖల అధికారులకు ఇవ్వడం వల్ల ఆ నష్టాన్ని సంపాదించేందుకు రేట్లు పెంచి అమ్ముకోవాల్సి వస్తోందంటున్నాడు. ఎవ్వరికీ ఉచితంగా టపాసుల బాక్సులు ఇవ్వకపోతే తక్కువ రేట్లకే విక్రయించొచ్చని కుండబద్ధలు కొడుతున్నాడు.
అధికారులకు పందారం.. ప్రజలపై పెను భారం