
దళితుల సమస్యలకు సత్వర పరిష్కారం
ఎస్సీ కాలనీ శ్మశానవాటికల అభివృద్ధికి నిధులు కాణిపాకం ఆలయ శానిటేషన్ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పై విచారణ త్వరలో చిత్తూరు గాంధీ సర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహం కలెక్టరేట్‌లోనిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు
చిత్తూరు కలెక్టరేట్ : దళితుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ (డీవీఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సభ్యులు జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను సందర్శించి సమస్యలను గుర్తించి నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో ఈ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. కాణిపాకం ఆలయంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ శానిటేషన్ సిబ్బందిపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని విచారించేందుకు చిత్తూరు ఆర్‌డీవోను విచారణ అధికారిగా నియమించామని తెలిపారు. రెండు రోజుల్లో విచారణ నివేదికలు అందిన వెంటనే చర్యలు చేపడుతామన్నారు. జిల్లాలో 60 వేల మంది గిరిజనులు ఉన్నారని, ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉండేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 50 గ్రామ పంచాయతీలలో గిరిజనుల సమస్యలపై సర్వే నిర్వహించామన్నారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. జిల్లాలోని ఎస్సీ కాలనీలలో శ్మశానవాటికల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తామన్నారు. జెడ్పీ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. సభ్యుల ఆమోదంతో చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం పక్కనే అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులలో 28 విచారణ చేసి 42 మంది బాధితులకు రూ.37,50,000 చెల్లించినట్టు తెలిపారు. సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, డీఆర్‌వో మోహన్‌కుమార్, ఆర్‌డీవోలు శ్రీనివాసులు, భవాణి, అనుపమ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి, డీవీఎంసీ సభ్యులు మునీంద్రనాయక్, రాజ్‌కుమార్, వరలక్ష్మి, జీవీరమణ, శేషాద్రి, మునస్వామి, రఘురాం తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ
పాల్గొన్న కమిటీ సభ్యులు, అధికారులు, పోలీసులు

దళితుల సమస్యలకు సత్వర పరిష్కారం