
మీకు చేతనైంది చేసుకోండి
ఓ మద్యం షాపు లైసెన్సు దారునిపై పోలీసుల దురుసు ప్రవర్తన మరో వీడియో వైరల్ సంచలన ఘటనలకు అడ్డాగా పూతలపట్టు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: మద్యం షాపును టెండర్‌లో దక్కించుకున్న లైసెన్సుదారునిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటన పూతలపట్టు మండలంలో చోటుచేసుకుంది. పూతలపట్టు పోలీసు స్టేషన్లో వారం క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో అసలు పూతలపట్టులో ఏం జరుగుతుందో తెలియక అటు పాలకులు, ఇటు ప్రభుత్వాధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ‘ఒక లైసెన్సు దారునిపై ఇంత కేవలంగా మాట్లాడుతారా? మండలంలో మిగిలిన మద్యం షాపుల యజమానులు మాత్రం బెల్టు షాపులకు మద్యం సరఫరా చెయ్యొచ్చు. వాళ్లను మాత్రం వదిలేయొచ్చు. మా షాపు నుంచి బెల్టు షాపులకు పంపిస్తే మాత్రం దాడులకు తెగబడుతున్నారు. ఇదెక్కడి న్యాయం.. ప్రతి నెలా మీరు మా నుంచి మామూళ్లు తీసుకుంటున్నారు కదా. ఇదెక్కడి న్యాయం సార్. సమన్యాయం పాటించండి. కావాలనే మాపై నాలుగు సార్లు దాడులు చేశారు. మిగిలిన వాటిపై ఎందుకు చెయ్యడం లేదు. ఒక పోలీసుగా మీరు న్యాయం చేయాలి. మీరు చెప్పినట్లుగానే మేము చేస్తు న్నాం కదా. కానీ మాపై ఇలా కక్ష కట్టడం భాగాలేదు సార్. ఈ విషయంపై మీతో మాట్లాడాలని స్టేషన్‌కు వస్తే బయటకి పోరా అని అంటారా?. పోలీసు స్టేసన్ ఉన్నది మా సమస్యలు చెప్పుకుని వాటిని పరిష్కరిస్తారని. కానీ మీరేం చేస్తున్నారు. ఓ వర్గానికి కొమ్ముకాస్తారా. ఈ విషయంపై ఐజీ, డీఐజీకి ఫిర్యాదు చేస్తాం’.. అని రంగంపేట క్రాస్‌లో ఉన్నటువంటి ఓ మద్యం షాపు యజమాని పూతలపట్టు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీసు మీకు చేతనయ్యింది చేసుకోండి.. మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని వారిని బెదిరించాడు. ఈ ఉదంతంపై ఇప్పుడు పూతలపట్టులో చర్చనీయాంశంగా మారింది. మండలంలో మునుపెన్నడూ లేని కొత్త సంప్రదాయానికి తెర లేవడంతో సంచలన ఘటనలకు పూతలపట్టు అడ్డాగా మారింది. సామాన్య ప్రజల్లో సైతం భయాందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.