
మహిళలను కించపరచడమా..సిగ్గు సిగ్గు
– ఎమ్మెల్యే థామస్‌పై చర్యలు తీసుకోండి
కార్వేటినగరం : సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళలతో వెళ్లి కార్వేటినగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు ఆత్మగౌరవం, మహిళలే మాకు ఆరాధ్య దైవం అని గొప్పలు చెప్పుకునే టీడీపీ ఎమ్మెల్యేలు ఒక మహిళ అయిన తనను పబ్లిక్‌లో కట్టూబొట్టు, వస్త్రధారణ పై అవహేళన చేస్తూ అవమానించడం బాధాకరమన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించక, మహిళలు ధరించే చీర, బొట్టు, నగలపై ఎమ్మెల్యే థామస్ అవహేళన చేస్తూ మాట్లాడడం దారుణమన్నారు. తన తండ్రి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపైన, తనపైన అనుచితంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హోదా రావాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు శేఖర్‌రాజు, మణి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రాధికరెడ్డి, జెడ్పీటీసీలు సుకుమార్, అన్బులగన్, సర్పంచ్ ధనుంజయవర్మ, నాయకులు వెంకటరత్నం, ధనశేఖర్‌యాదవ్, తౌకిర్‌ఖాన్, మహిళ నాయకురాలు మోహనకుమారి తదితరులు పాల్గొన్నారు.

మహిళలను కించపరచడమా..సిగ్గు సిగ్గు