ఎఫ్‌సీ రూటే సపరేటు | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీ రూటే సపరేటు

Oct 12 2025 6:45 AM | Updated on Oct 12 2025 6:45 AM

ఎఫ్‌స

ఎఫ్‌సీ రూటే సపరేటు

వాహనాలకు ఎఫ్‌సీ ఇచ్చేందుకు అదనపు వసూళ్లు ఒక్కో వాహనానికి ఒక్కో రేటు ఏజెంట్‌ ద్వారా వెళ్తేనే.. లేదంటే వాహనాన్ని తిప్పి పంపడం ఖాయం కమీషన్‌ ఇస్తేనే సర్టిఫికెట్‌ మంజూరు పట్టించుకోని అధికారులు

‘మేము ఆటో డ్రైవర్లం. ఎఫ్‌సీకి నేరుగా వస్తే పని కాదు.. వస్తే సాకులు చెప్పి రిజెక్టు చేస్తున్నారు. అదే ఏజెంట్ల ద్వారా వస్తే తక్షణం పనులు జరుగుతున్నాయి. ఆటోకు ఎఫ్‌సీ గడువు తీరి నాలుగు నెలలు గడుస్తోంది. దీనికారణంగా ఆన్‌లైన్‌లో చలానా రూ.1,400 వరకు వచ్చింది. ఒక్కో ఆటోకు ఓ ఏజెంట్‌ రూ.3,400 వరకు వసూలు చేస్తున్నాడు. లేకుంటే ఒకటికి రెండు సార్లు రావాలంటే ఇబ్బంది పడాలి, జిల్లా అంతటికీ ఇదొక్కటే సెంటర్‌..శ్రీ అంటూ వారి ఇబ్బందులను బహిరంగంగానే ఆటో డ్రైవర్లు ‘సాక్షి’కి వివరించారు.

కాణిపాకం : ఇటీవల ఏర్పాటు చేసిన ఆర్టీఏ కార్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న ఫిట్‌నెస్‌ సెంటర్‌ (గవర్నమెంట్‌ అప్రూవ్డ్‌ ఆటోమేటిడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌)లో అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి వాహనానికీ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అనే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఆయా వాహనాలకు యజమానుల నుంచి భారీగా కమీషన్లు తీసుకుంటూ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఏజెంట్లుగా అవతారమెత్తిన దళారులు ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీటి కట్టడికి కళ్లెం వేసే వారు లేకపోవడంతో అడ్డూ అదుపు లేకుండా దోచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అన్ని వాహనాలకూ ఇక్కడే.. పరీక్ష !

జిల్లా కేంద్ర సమీపంలోని బంగారుపాళ్యం వద్ద ఇటీవల ఆటోమెటిక్‌ ఫిట్‌నెస్‌ స్టేషన్‌ ఏర్పాటయ్యింది. ఎఫ్‌సీ కోసం జిల్లాలోని ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన అన్ని వాహనాలు ఇక్కడే పరీక్షించుకోవాలి. కుప్పం, పుంగనూరు, నగరి, పలమనేరు నియోజకవర్గాల వారికి ఈ టెస్టింగ్‌ సెంటర్‌ ఇబ్బందికరంగా మారింది. రానుపోను ఒక రోజంతా కేటాయించాల్సి వస్తోంది. ఒక వేళ టెస్ట్‌ పాస్‌ కాకపోతే మళ్లీ రావాల్సి వస్తోంది. దీన్ని అదునుగా చేసుకుని కొందరు వసూళ్లకు తెరలేపారు. పాత వ్యక్తులే ఇక్కడ ఏజెంట్‌గా పాతుకుపోయి దందా కొనసాగిస్తున్నారు.

పాతుకుపోయారు

ఇన్నాళ్లు కార్యాలయంలో పాతుకుపోయిన ఏజెంట్లే.. ఇప్పుడు ఏటీఎస్‌ వద్ద పాగా వేశారు. వారి కన్నుసన్నల్లోనే ఏటీఎస్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏజెంట్లకు ఆయా వాహనాలకు సుమారు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు కమీషన్‌ ముట్టజెప్తేనే బండి పాస్‌ అవుతున్నాయి. లేదంటే సాకులు వెతికి గేటు నుంచి వెనక్కి పంపేస్తారు. పొరపాటున ఎవరైనా సిఫార్సు ద్వారా చలానా మాత్రమే తీసి టెస్టింగ్‌కు పంపిస్తే మాత్రం, లేనిపోని కారణాలు చెప్పి ఫిట్‌నెస్‌ ఫెయిల్‌ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇక బండి రాకున్నా కూడా రూ.10 వేలు ఇస్తే పరీక్ష చేసేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

గంటల కొద్దీ నిరీక్షణ

కొన్నేళ్ల కిందటి వరకు ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కావాలంటే క్షణాల్లోనే ఇచ్చేవారు. ఆయా వాహనాలకు సంబంధించిన కాగితాలు చూసి ఆర్టీఏ సిబ్బంది వాహనాన్ని డ్రైవింగ్‌ చేసి పంపేవారు. కానీ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ కేంద్రంలో ఏదైనా వాహనం లోపలకు వెళ్తే మాత్రం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం వెళ్లిన బండ్లు సాయంత్రానికే తిరిగి వస్తాయి. సహనం కోల్పోతున్న వాహన డ్రైవర్లు ఫిట్‌నెస్‌ కేంద్ర సిబ్బందితో వాగ్వావాదం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అంతా ఏజెంట్ల సమక్షంలోనే..

గత ప్రభుత్వంలో ఆర్టీఏ పనులు వాహన్‌ యాప్‌లో, స్థానిక సచివాలయంలో త్వరితగతిన జరిగేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఏజెంట్లతోనే అంతా కమీషన్‌ పద్ధతిలో ఫిట్‌నెస్‌ కేంద్రంలో జరగడం గమనార్హం. ప్రతీ ఫైల్‌కు ఒక్కో రేటు పెట్టి ఆ రేటును ఏజెంట్లకు ముట్టజెప్పితేనే బండికి ఫిట్‌నెస్‌ అందిస్తారు. అయితే ఇవేమీ అక్కడ చెల్లుబాటు కావడం లేదు. కేవలం ఏజెంట్ల చేతిలోనే జరిగిపోతున్నాయి. పట్టించుకునే వారు లేక మూముళ్ల వ్యవహారం మితిమీరిందని పలువురు ఆరోపిస్తున్నారు.

ముక్కుపిండి వసూళ్లు

డబ్బులు ఇవ్వొద్దు

ఒకప్పుడు వాహనానికి ఫిట్‌నెస్‌ పరీక్షలు మా ఆర్టీఏ పరిధిలో ఉండేవి. ఇప్పుడు అంతా ప్రైవేటుపరమైంది. బండిని సక్రమంగా టెస్టుకు తీసుకెళ్లండి. లోటుపాట్లు లేకుండా చూసుకోండి. అసలు డబ్బులు ఇవ్వొద్దు. ఏదైనా ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందిస్తాం. చర్యలు తీసుకుంటాం.

– కృష్ణవేణి, జేటీసీ, రవాణాశాఖ

జిల్లాలోని ట్రాన్స్‌పోర్ట్‌, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు సంబంధించి ఇక్కడ నుంచే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారు, బస్సు, ఆటో, లారీ ఏ వాహనమైనా ప్రభుత్వానికి కట్టాల్సిన చలానా రూ.800 నుంచి రూ.2,000 లోపు ఉంటుంది. ఆటోకు రూ.600, టాటా ఏస్‌, బొలెరో, నాలుగు చక్రాల గూడ్స్‌ వాహనాలకు రూ.1,200, సెవెన్‌ సీటర్‌ మోటర్‌ క్యాబ్‌కు రూ.2 వేలు, టెంపో వాహనాలకు రూ.2,500, ఎంజీవీ వాహనాలకు రూ.2,500, పది చక్రాల టిప్పర్‌కు రూ.3 వేలు, 12 చక్రాల లారీ (టిప్పర్‌)కు రూ.3,200, 14, 16 చక్రాల లారీకి రూ.4 వేలు, బస్సుకు రూ.3,500, ట్రాక్టర్‌కు రూ.వెయ్యి చలానా కట్టాలి. అయితే ఫీజులతో పాటు అదనంగా వసూలు చేస్తుండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఏ వాహనానికి ఎంత మామూళ్లు వసూలు చేయాలో ముందుగానే ధర నిర్ణయించి కరపత్రం రూపంలో ఏజెంట్లకు అందజేయడం, ఆ ప్రకారమే మామూళ్లు వసూలు చేస్తుండడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎఫ్‌సీ రూటే సపరేటు1
1/1

ఎఫ్‌సీ రూటే సపరేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement