
ఎన్టీఆర్ జలాశయం గేట్ల ఎత్తివేత
పెనుమూరు(కార్వేటినగరం): జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కలవకుంట వద్ద ఉన్న ఎన్టీర్ జలాశయం గేట్లను శనివారం ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. మొత్తం 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయానికి ఎగువ ప్రాంతాలైన పూతలపట్టు, పాకాల, దామలచెరువు, ఐరాల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. పది వేల క్యూసెక్కుల నీరు చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ ఏఈ భరత్ తెలిపారు. చిత్తూరు– పెనుమూరు జాతీయ రహదారిపై జలాశయం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. జలాశయానికి దిగువన ఉన్న జీడీనెల్లూరు ప్రజలు, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఎలాంటి పరిస్థితుల్లోనూ నదిని దాటేందుకు సాహసించొద్దని సూచించారు.