
నా కొడుకుని బతికించండి
గంగాధరనెల్లూరు: ‘ఒక్కగానొక్క కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పట్టుమని పదేళ్లు నిండకుండానే లివర్ సమస్యతో అల్లాడిపోతున్నాడు. రోజురోజుకీ బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తోంది. అతన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కాపాడుకోవడానికి చేతిలో చిల్లిగవ్వలేదు. ఎలా బతికించుకోవాలో అర్థం కావడం లేదు. సాయం చేసే చేతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం.’ అంటూ కడుపులో బాధ దిగమింగుకుని, కళ్లల్లో నీళ్లు పెట్టుకుని గంగాధరనెల్లూరు మండలం, తూగుండ్రం పంచాయతీ, బాలయ్యకొత్తూరు గ్రామానికి చెందిన దంపతులు నీతూ, నరసింహారెడ్డి వేడుకుంటున్నారు. వివరాలు.. నీతూ, నరసింహారెడ్డికి వెంకటేష్ (9), చంద్రిక (7) పిల్లలున్నారు. కుమారుడు వెంకటేష్ తూగుండ్రం ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అతనికి ఏడాది క్రితం జ్వరం రావడంతో చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు అందించారు. ఆపై వివిధ సమస్యలు రావడంతో చీలాపల్లి సీఎంసీకి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి వెంకటేష్‌కి లివర్ సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. ఏడాదిగా రూ.8 లక్షల వరకు అప్పు చేసి మందులు, మాత్రలతో నెట్టుకొస్తున్నారు. కానీ బిడ్డ పరిస్థితి మాత్రం మెరుగు పడలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
ప్రాణాలు అడ్డుపెట్టిన తల్లి!
ఈ క్రమంలో తన తల్లి నీతు లివర్‌ను కొంత తీసి బిడ్డకు పెట్టాలని నిశ్చయించారు. దానికి డాక్టర్లు కూడా అంగీకరించారు. అయితే చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో తల్లీబిడ్డ ఆపరేషన్ తర్వాత పరిస్థితి ఏంటని మదనపడుతున్నారు. ఆపరేషన్‌కు రూ.20 లక్షలు, బాధితులు కోలుకోవడానికి మరో రూ.పది లక్షల వరకు అవసరముంటుందని డాక్టర్లు చెబుతున్నారు.