
ఉగ్రరూపం దాల్చిన బహుదానది
తవణంపల్లె: మండలంలోని బహుదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలతో పాటు అరగొండ వద్ద బహుదానది ఉగ్రరూపం దాల్చింది. పడమటి మండలాల్లోని అడవుల్లో నుంచి భారీగా వర్షపు నీరు చేరుతోంది. మాధవరం వంక, బోయపల్లె వంక, మత్యం వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇవి బహుదానదిలో కలవడంతో నదికి వరద నీరు పోటెత్తింది. శనివారం సాయంత్రానికి నదిలో నీటి శాతం కొంతమేర తగ్గింది.
తెగిన కల్వర్టులు
ప్రతి ఏటా భారీ వర్షాలప్పుడు కల్వర్టులు తెగిపోవడం రివాజుగా మారుతోంది. అరగొండ–గాజులపల్లె మధ్యలో ఉన్న కల్వర్టు, గాజులపల్లె–సరకల్లు రోడ్డు మధ్యలో తొడతర దగ్గర ఉన్న కల్వర్టు, అరగొండ– ఎ.గొల్లపల్లెకు వెళ్లే దారిలోని కల్వర్టు, మత్యం క్రాస్– ఎగువ మత్యం వెళ్లే దారిలోని కలర్టులు వరద ఉధృతికి కోతకు గురయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కనీసం పాల వ్యాన్లు, స్కూల్ బస్సులు కూడా తిరగడం లేదు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
జాగ్రత్తగా ఉండాలి
మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 35 గంటల పాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు తగ్గుముఖం పట్టి వాగుల్లో ప్రవాహం ఉధృతి తగ్గే వరకు జనాలు తెగిన కల్వర్టులపై వెళ్లరాదు. వరద ఉధృతికి దెబ్బతిన్న కల్వర్టు దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాహనాలు, ప్రజలు వెళ్లకుండా అడ్డుకట్టలు వేయించారు.
– సుధాకర్, తహసీల్దార్