
షెడ్డు తొలగిస్తావా! కేసులు పెట్టమంటావా?
పాలసముద్రం: ‘షెడ్డు తొలగిస్తావా.. కేసులు పెట్టమంటావా..?’ అంటూ టీడీపీ నాయకుల ఒత్తిడితో అధికారులు ఓ వ్యక్తిని బెదిరించిన ఘటన మండలంలో సంచలనంగా మారింది. వివరాలు.. మండలంలోని వనదుర్గాపురం ఆదిఆంధ్రవాడకు చెందిన పీ.కృష్ణయ్యకు 2019 నుంచి జగనన్న కాలనీలోని ఖాళీ స్థలంలో కొబ్బరి కీతులతో గుడిసె వేసుకుని అందులో నివాసముంటున్నాడు. వనదుర్గాపురంలో ఉన్నట్లు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం అప్పు చేసి పక్కనే ఇనుపరేకులతో షెడ్డు వేశాడు. దీన్ని గమనించిన వనదుర్గాపురంలోని టీడీపీ నాయకులు డబ్బులిస్తే పట్టా ఇప్పిస్తామని, లేకుంటే షెడ్డుని తొలగించి బయటకు వెళ్లగొడతామని బెదిరించారు. కానీ కృష్ణయ్య వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఆగ్రహించిన టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ అరుణకుమారి, ఆర్‌ఐ దేవి, వీఆర్‌ఓ వెంకటాచలం శనివారం షెడ్డు వద్దకు చేరుకుని పరిశీలించారు. రాజకీయ ఒత్తిడి ఎక్కువైందని, వెంటనే షెడ్డుని తీసేయాలంటూ హుకుం జారీచేశారు. లేకుంటే కేసులు పెడతామంటూ వీఆర్వో వెంకటాచలం హెచ్చరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ వనదుర్గాపురం పంచాయతీల్లో అగ్రకులస్తులకు ఒక్కో కుటుంబంలో రెండు, మూడు పట్టాలున్నాయని, రోజూ కూలికెళ్లే తనకు ఇంటి పట్టా ఇవ్వమంటే ఎలా అని టీడీపీ నాయకులతోపాటు అధికారులను నిలదీశారు. సంబంధిత ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని కోరారు.