
గుజ్జు ఫ్యాక్టరీలకు కూటమి సహకారమా?
యాదమరి: గుజ్జు ఫ్యాక్టరీలకు కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి పరోక్ష సహకారం ఉండడంతోనే మామిడికి రూ.8 చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్, మునీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈనెల 15న బంగారుపాళ్యంలో నిర్వహించనున్న ఆక్రందన సభ విజయవంతం కోసం వారు సోమవారం పూతలపట్టు, పి.కొత్తకోట, కొటాలం గ్రామల్లోని రైతులను కలసి కరపత్రాలను అందజేశారు. వారు మాట్లాడుతూ మామిడి బిల్లుల ఆలస్యానికి గల కారణం కర్మాగారాల యాజమాన్యంతో పాటు కూటమి ప్రభుత్వ పెద్దలేనన్నారు. గుజ్జు కర్మాగారాలకు లబ్ధి చేకూర్చడానికి 40 వేల మంది రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. బుధవారం జరిగే ఆక్రందన సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి సంజీవరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాజారత్నం రెడ్డి, రైతు నాయకులు చెంగల్రెడ్డి, నరసింహులు నాయుడు, జ్ఞానశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.