
టీడీపీ నేత బద్రీ ఆగ్రహం
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై టీడీపీ నేత, మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడి తమ్ముడు బద్రీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బలిజ సంఘ నాయకులతో కలిసి ఆయన కార్పొరేషన్ కార్యాలయంలో సహాయ కమిషనర్ ప్రసాద్‌ను కలిసి, వినతిపత్రం అందచేశారు. బద్రీనారాయణ మాట్లాడుతూ కొంగారెడ్డిపల్లిలో శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్‌ను తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. కొంగారెడ్డిపల్లెలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ కడుతున్నారని, దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే కౌన్సిల్ అనుమతితో ఏర్పాటుచేసి ప్రజలకు శుద్ధినీటిని అందిస్తున్న వాటర్ ప్లాంట్ కొట్టేస్తామని చెప్పడం మంచిదికాదన్నారు. వాటర్‌ప్లాంట్ కొట్టేస్తే ఊరుకునేదిలేదన్నారు. 2014లో నాటి ఎమ్మెల్యే సత్యప్రభ, సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్‌ను ప్రారంభించారని గుర్తుచేశారు. అవసరమైతే వాటర్ ప్లాంట్‌ను మరో స్థలంలో ఏర్పాటు చేస్తామని ఏసీపీ నాగేంద్ర చెప్పడంతో.. దీన్ని అంగీకరించబోమని బద్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.