
హోం వర్క్ రాయలేదని.. తల పగులగొట్టేశాడు!
బ్యాగుతో బాలిక తలపై దాడి ఆరు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తలలో ఎముకలు విరిగాయని నిర్ధారణ పాఠశాలను ముట్టడించిన బాధితులు, విద్యార్థి సంఘాలు పరారీలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు నిందితులపై కేసు నమోదు
పుంగనూరు: హోంవర్క్ రాయలేదని హిందీ టీచర్ 6వ తరగతి బాలిక తలను బ్యాగ్‌తో పగులగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలను సీజ్ చేయాలంటూ బాధితురాలి తల్లి, విద్యార్థి సంఘాలు మంగళవారం పాఠశాలను ముట్టడించాయి. విద్యార్థిని తల్లి తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు పట్టణంలోని నాగపాళెంలో నివాసం ఉన్న హరి, విజేత దంపతుల కుమార్తె సాత్విక నాగశ్రీ (11) స్థానిక భాష్యం పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తల్లి విజేత అదే పాఠశాలలో పనిచేస్తోంది. ఇలా ఉండగా ఈ నెల 10న ఉదయం క్లాసులో హిందీ హోంవర్క్ రాయలేదంటూ టీచర్ సలీంబాషా బ్యాగుతో విద్యార్థిని తలపై బలంగా కొట్టాడు. ఆ బాలిక నొప్పితో అల్లాడిపోయింది. తల్లి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించింది. అనంతరం బెంగళూరులోని ప్రయివేటు ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలు చేయించారు. తలలో ఎముకలు విరిగిపోయాయని, చికిత్సకు సుమారు రూ.15 లక్షల మేరకు ఖర్చు అవుతుందని తెలియజేశారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలతో కలసి మంగళవారం పాఠశాల గేటుకు గడియ పెట్టి, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘ కార్యదర్శి మున్న ఆధ్వర్యంలో పాఠశాలను ముట్టడించి నిరసన తెలిపారు. బాలికను కొట్టిన టీచర్, ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేయాలని, పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు ధనుంజయ, ప్రవీణ్, రాజేష్, లోకేష్, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.
కేసు నమోదు
విద్యార్థిని గాయపరిచిన కేసులో ప్రిన్సిపల్ సుబ్రమణ్యం, హిందీ టీచర్ సలీంబాషాపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. కాగా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిసింది.
ఎంఈవో విచారణ
విద్యార్థినిని గాయపరిచిన కేసుకు సంబంధించి భాష్యం పాఠశాలలో విచారణ చేపట్టినట్లు ఎంఈవో నటరాజారెడ్డి విలేకరులకు తెలిపారు. పాఠశాలలో పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదికలను డీఈవో, జిల్లా కలెక్టర్‌కు పంపుతామని ఆయన వెల్లడించారు.
పాఠశాలను ముట్టడించిన ఏఐఎస్‌ఎఫ్ నాయకులు
నిరసన తెలుపుతున్న విదార్థిని తల్లి

హోం వర్క్ రాయలేదని.. తల పగులగొట్టేశాడు!