
కార్వేటినగరాన్ని తిరుపతిలో చేర్చాలి
కార్వేటినగరం : తుడా పరిఽధిలో ఉన్న కార్వేటినగరాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని అఖిలపక్ష నాయకులు ఆదివారం స్కంధ పుష్కరిణి వద్ద డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బౌగోళికంగా అత్యంత దగ్గరగా ఉండడమే కాకుండా సామాజిక, ఆర్థిక , వ్యాపార, విద్యా, ఉద్యోగ, ఆరోగ్య పరంగా ఎన్నో దశాబ్దాలుగా కార్వేటినగరం మండల ప్రజలు తిరుపతి పట్టణంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. అలాంటి మండలాన్ని తిరుపతిలో విలీనం చేయాలని గతంలో బాధుడే బాధుడు కార్యక్రమానికి విచ్చేసిన నేటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారానికి వచ్చిన వెంటనే కార్వేటినగరాన్ని తిరుపతిలో చేరుస్తానని హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 16 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన మాటను నెరవేర్చలేదన్నారు. అదే విధంగా వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేరుస్తానన్నారు. ఆ హామీలపై ప్రజా ప్రతినిధులు స్పందించి కార్వేటినగరం ప్రజల ఆశాభావాన్ని నెరవేర్చాలని అన్నారు. అనంతరం కార్వేటినగరం తిరుపతిలో విలీనం చేయడంపై పోరాటం చేయడానికి ఉపాధ్యాయ సంఘ నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు, కార్యాచరణ రూపొందించారు. ఈ పోరాటానికి రాజకీయ, కుల, మతాలకు అతీతంగా కలసి రావాలని పిలుపునిచ్చారు. త్వరలో చిత్తూరు కలెక్టర్, నగరి ఆర్డీఓలకు వినతి అందిస్తామన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్, వెంకట కృష్ణయాదవ్, పలువురు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.