
దసరా మహోత్సవాలకు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్/ చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు జిల్లా అధికారులకు ఈఓ ఏకాంబరం సోమవారం ఆహ్వాన పత్రికలు అందజేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జేసీ విద్యాధరి, డీఎఫ్‌ఓ భరణి, పలమనేరు ఆర్డీఓ భవానితోపాటు పలువురు అధికారులకు ఆహ్వాన పత్రికలు అందజేసి అందజేసి సత్కరించారు. కుటుంబ సమేతంగా దసరా వేడుకల్లో పాల్గొనాలని కోరినట్లు ఈఓ తెలిపారు.
నిందితుడికి రిమాండ్
చిత్తూరు అర్బన్: ప్రభుత్వాస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి కేసులో నిందితుడిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. చిత్తూరు నగరానికి చెందిన మొగిలీశ్వర్ అనే విద్యార్థి రక్తగాయాలతో శుక్రవారం రాత్రి జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించాడు. చికిత్స చేసే క్రమంలో వైద్యులకు.. విద్యార్థి, అతని స్నేహితులకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. ఆపై విద్యార్థి, అతని స్నేహితులు కలిసి ముగ్గురు వైద్యులను చితకబాదారు. ఓ వైద్యుడి ముక్కును పగులగొట్టారు. దీంతో వైద్యులు నిరసనకు దిగడం, ఫిర్యాదు చేయడంతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మొగిలీశ్వర్‌ను సోమవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
రెండు ద్విచక్ర వాహనాల ఢీ
రొంపిచెర్ల: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకుని ఒకరు మృతి చెందగా.. భార్యాభర్తలు తీవ్రంగా గాయపడిన ఘటన బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారి, రొంపిచెర్ల మండలం, అదర్శ పాఠశాల సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. అన్నమ్మయ్య జిల్లా, పీలేరు మండలం, ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయకుమార్ (23), భార్య రాజేశ్వరి(20) ద్విచక్ర వాహనంలో పీలేరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో రొంపిచెర్ల గ్రామ పంచాయతీ లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన ఎం.ఎస్.మహమ్మద్ గౌస్‌పీర్(38) రొంపిచెర్ల నుంచి పీలేరు వైపు ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. ఈ రెండు వాహనాలో ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గరుకి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మహమ్మద్ గౌస్‌పీర్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆయన రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి ఒక భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కుటుంబ యాజమాని మృతి చెందడంతో వారి కుటుంబం రోడ్డున పడింది. భార్యాభర్తలు ఇరువురూ పీలేరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రొంపిచెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.