
జూనియర్ కాలేజీలో చోరీ
– ఇంటి దొంగల పనేనా?
శాంతిపురం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ప్రిన్సిపల్ రూమును లక్ష్యంగా చేసుకుని శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. విద్యుత్ సరఫరాను ఆపేసి, గది బయట వేసిన నాలుగు తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. మొత్తం ఆరు బీరువాలను పగులగొట్టి రికార్డులను చిందరవందర చేశారు. తమకు కావాల్సిన రికార్డులను గుర్తుతెలియని వ్యక్తులు పట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం వస్తుందన్న కారణంగా కాలేజీ సిబ్బంది ఏ వస్తువునూ తాకకపోవడంతో ఏయే రికార్డులు చోరీ అయ్యాయనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే కాలేజీలో మొత్తం 16 సీసీ కెమెరాలు పెట్టించారు. శుక్రవారం రాత్రి చొరబడిన దుండగులు తమకు సంబంధించిన పుటేజీ దొరక్కుండా చేసేందుకు సీసీ టీవీలకు సంబంధించిన డీవీఆర్‌ను కూడా పట్టుకుపోయారు. కశాశాల నిర్వహణ లోపాలపై వచ్చిన ఫిర్యాదులతో ఈ నెల 9 శాఖాపరమైన విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విచారణలో తమ అక్రమాలు వెలుగు చూడకుండా చేసేందుకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారే రికార్డులను మాయం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై కాలేజీ సిబ్బంది ఫిర్యాదు మేరకు రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.