
తప్పుకదా ‘గురూ’!
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ పోస్టులను కై వసం చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. ఎలాగైన కొలువులు కొట్టేదామని భావించారు. అయితే అధికారుల పరిశీలనలో అభ్యర్థులు సమర్పించిన వివరాలు, సర్టిఫికెట్లలో తప్పిదాలను గుర్తించారు. దీంతో పలువురు అభ్యర్థుల పై అనర్హత వేటు వేశారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలనలో ఒకటికంటే ఎక్కువ పోస్టులకు ఎంపికై న వారిని ఆప్షన్ మేరకు ఒక పోస్టుకు పరిమితం చేశారు. ఇతర స్థానాల్లో ఉన్న తదుపరి అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
బోగస్ సర్టిఫికెట్లతో మోసం
మెగా డీఎస్సీలో కొందరు అభ్యర్థులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి మోసం చేసేందుకు ప్రయత్నించారు. దివ్యాంగ, అంధత్వ, చెవిటి, మూగ, ఇలా పలు రకాల వికలత్వంతో డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి తిరుపతి రుయా ఆస్పత్రిలో మరోమారు పున:పరిశీలన నిర్వహించగా గుట్టురట్టయ్యింది. పలువురు అభ్యర్థులు సమర్పించిన వికలత్వ సర్టిఫికెట్లు బోగస్ అని అక్కడి వైద్యులు తేల్చారు. దీంతో అలాంటి వారందరినీ అనర్హులుగా ప్రకటించారు. మొత్తం 68 మంది పీహెచ్ కేటగిరీలో ఎంపికవగా వారిలో 56 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిగిలిన 12 మందివి బోగస్ సర్టిఫికెట్లుగా గుర్తించారు.
ఈడబ్ల్యూఎస్‌లో కూడా...
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లలో కూడా కొన్ని నకిలీవి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై పలువురు అభ్యర్థులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు చేశారు. అనుమానం, ఫిర్యాదులు అందిన అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అయితే ఆ వివరాలు బయటకు రానివ్వకుండా విద్యాశాఖ అధికారులు తొక్కిపెట్టారు. గుర్తించిన బోగస్ సర్టిఫికెట్ల సమగ్రవివరాలను రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో పంపించారు.
ఇప్పటికి మూడు విడతల్లో పరిశీలన
ఇప్పటికీ డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మూడు విడతల్లో నిర్వహించారు. ఈనెల 6 నాటికి రెండు వి డతల్లో పరిశీలన ప్రక్రియ నిర్వహించగా తాజాగా శనివారం మూడో విడతలో ఎంపికై న అభ్యర్థుల జాబితా ను విడుదల చేశారు. ఆ అభ్యర్థుల జాబితా ప్రకారం ఆదివారం మూడో విడత సర్టిఫికెట్‌ల పరిశీలన నిర్వహించనున్నారు.