
గురువుపై బరువు
●
కార్వేటినగరం: పాఠాలు చెప్పి విద్యార్థులను ఉన్నంతగా తీర్చిదద్దే ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం భారం మోపుతోంది. మూల్యాంకనంలో తీసుకొచ్చిన అసెస్మెంట్ బుక్‌లెట్ విధానం గుదిబండగా మారింది. వాస్తవానికి ఫార్మేటీవ్, సమ్మెటీవ్ పరీక్షలు ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన జవాబు పత్రాలు, ఓఎమ్మార్ షీట్లను అసెస్మెంట్ బుక్‌లెట్‌లో పొందుపర్చాలి. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని మార్కులను ఇందులోనే నమోదు చేయాలి. ఒక్కో పరీక్షకు సంబంధించి 100 జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంది. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గురుపై బరువెందుకు బాబూ..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇదీ లెక్క!
నిజానికి విద్యార్థులకు ఏడాదిలో నాలుగు ఫార్మేటీవ్‌లు, రెండు సమ్మేటీవ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ షీట్‌ఽను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. జవాబు పత్రాలను విద్యార్థులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీటిని టీచర్లు మూల్యాంకనం చేసి మార్కులను ఓఎమ్మార్ షీట్లలో పొందుపర్చేవారు. ఆపై జిల్లా అధికారులు స్కానింగ్ చేసి భద్రపరిచేవారు. మూల్యాంకనాన్ని మూడు రోజుల్లో పూర్తిచేయాలనే నిబంధన ఉండేది. దీంతో బోధించేందుకు ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం ఉండేది.
కొత్తగా ఇలా..
ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి పరీక్షల విధానంలో నూతన సంస్కరణలను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫార్మేటీవ్, సమ్మేటీవ్ పరీక్షల కోసం అసెస్మెంట్ బుక్‌లెట్‌ను ప్రవేశపెట్టింది. పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు, ఓఎమ్మార్ టీష్లను ఇందులో పొందుపరిచాలి. టెస్ట్ సమయంలో విద్యార్థులకు అసెస్మెంట్ బుక్‌లెట్‌ను ఇచ్చి అందులో జవాబులు రాయించాలి. ఇందులో వచ్చిన మార్కులను ఓఎమ్మార్ షీట్‌లో పొందుపరచడంతో పాటు స్కానింగ్‌ను కూడా ఉపాధ్యాయులే చేయించాలి. ఈ బుక్‌లెట్‌లో విద్యార్థి ఆధార్, యూడైస్, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్లనూ వీరే నమోదు చేయాలి. ఈ రకంగా ఏడాదిలో సబ్జెక్టుకు 6, 7 తరగతులకు 36, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 42 ఓ ఎమ్మార్ షీట్లుంటారయి. విద్యాసంవత్సరం ముగిసేంత వరకు జవాబు పత్రాలు, వారికొచ్చిన మార్కులను ఇందులో నమోదు చేయాలి. వీటిని పాఠశాలల్లోనే భద్రపరచాలి. ఇంటికి తీసుకెళ్లకూడదు.
పెరిగిన ఒత్తిడి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీప్ యాప్‌లో ఐఎమ్మెమ్మెస్, స్టూడెంట్స్ కిట్స్, మోగా పేటీఎంలను ఉంచారు. దీంతో పాటు పాఠశాలకు ప్రతి నెలా అందిన బియ్యం, బస్తాలపై క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి అందులోని నాణ్యతను పరిశీలించి ఆన్‌లైన్లో నమోదు చేయాలి. ఈ క్రమంలో ప్రభుత్వం పునరాలోచించి అసెస్మెంట్ విధానానికి స్వస్థి పలికి పాత పద్ధతినే కొనసాగించాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘనాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు కూటమి ప్రభుత్వం
అందించిన అసెస్మెంట్ బుక్‌లెట్
అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో అసెస్మెంట్ విధానం పిల్లలనే కాకుండా ఉపాధ్యాయులనూ పరిక్షించే విధంగా మారింది. దీని వల్ల బోధనకు వారం పాటు దూరంగా ఉండాల్సి వస్తొంది. ప్రాజెక్టుల పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారు. తరగతికి మించిన స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటోంది. ఇలాంటి పనులతో ఉపాధ్యాయులు బోధనకు దూరంగా ఉంటున్నారు.
– కిరణ్, ఏపీటీఎఫ్1938 చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, కార్వేటినగరం
అసెస్‌మెంట్ విధానాన్ని తొలగించాలి
అసెస్మెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలి. ఈ ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. బోధనేతర పనుల భారాన్ని మోపడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూల్యాంకనంలో పాత విధానాన్నే కొనసాగించాలి.
– చలపతిరావు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా సీపీఎస్సీ అధ్యక్షుడు, కార్వేటినగరం

గురువుపై బరువు