యాదమరి : ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు దాడికి యత్నించారు. వివరాలు.. బుధవారం రాత్రి చిన్నంపల్లెకు చెందిన ఓ విద్యార్థిని చిత్తూరులోని ఎంఎస్సార్ కూడలి వద్ద మాదిరెడ్డిపల్లె వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు కిక్కిరిసి ఉండడంతో విద్యార్థినిని లోపలికి వెళ్లమని కండక్టర్ దురుసుగా చెప్పాడు. మనస్థాపం చెందిన యువతి ఈ విషయాన్ని తమ కుటుంబీకులకు ఫోన్ ద్వారా వెల్లడించింది. దీంతో యాదమరి బస్‌స్టాప్ వద్ద వారు బస్సును అడ్డగించి కండక్టర్‌పై దాడికి యత్నించారు. ప్రధానంగా తమ చెల్లెలుకు కండక్టర్ క్షమాపణలు చెబితే గానీ బస్సును కదలనివ్వబోమని యువతి సోదరులు పట్టుబట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు.
ఎరువుల అక్రమ నిల్వపై నిఘా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వలు, తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. బుధవారం ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎరువుల విక్రయదారులతో సమావేశం నిర్వహించి ముందస్తు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. నిరంతర పర్యవేక్షణలో ఎరువుల సరఫరా చేపడుతున్నామన్నారు. ఖరీఫ్ సీజన్‌కు మొత్తం 28,183 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని, ఇందులో 15 వేలు మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు 13,396 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 2,600 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఈ నెలలో 200 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చిందని, మరో 1500 టన్నులు త్వరలో వస్తాయమని వెల్లడించారు.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
శ్రీరంగరాజ పురం : ఎస్‌ఆర్‌పురం మండలం పాతపాళెంలో పూజా(27) అనే యువతిని హత్య చేసిన కేసులో నిందితుడు భాస్కర్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగరి డీఎస్పీ మహ్మద్ అజీజ్ కథనం మేరకు .. ఆగస్ట్ 17వ తేదీన పూజను సి.భాస్కర్ అనే యువకుడు మాట్లాడేందుకని తీసుకెళ్లి గొంతు నొక్కి చంపేశాడు. అనంతరం చెట్టుకు ఉరి వేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రించాడు. పూజ బలన్మరణానికి పాల్పడినట్లు కుటుంబీకుల భావించారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా పూజకు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే పూజను భాస్కర్ హత్య చేసినట్లు గ్రామంలో పుకార్లు రావడంతో వారు పెద్దమనుషులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు వెంటనే భాస్కర్‌ను పిలిపించి నిలదీశారు. దీంతో తానే పూజను హతమార్చినట్లు భాస్కర్ అంగీకరించి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.