రాజకీయ నాయకులు, అధికారుల అండ కొంత ఉండాలే కాని ఆక్రమణదారులకు అంతే ఉండదు. ఇందుకు నిదర్శనంగా పుత్తూరు పట్టణం నడిబొడ్డులో కోట్లు విలువ చేసే సుమారు రెండెకరాల ప్రభుత్వ భూమిని ఓ ప్రబుద్ధుడు దర్జాగా కబ్జా చేస్తున్నాడు. గత వారం రోజులుగా ముళ్ల కంపలను తొలగించి, తీర్చిన సదరు వ్యక్తి నేడు దర్జాగా దున్నడం మొదలు పెట్టాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పుత్తూరు: ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన విలువైన ప్రభుత్వ భూములు పరులపాలవుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్థానిక బైపాస్ రోడ్డులో గోవిందపాళెం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 282/4లో 1.76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలోని ఈ భూమికి ఆనుకొనే ఫ్‌లైఓవర్ బ్రిడ్జి, ఓ ప్రైవేటు కల్యాణ మండపంతోపాటు వివిధ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఇంతగా అభివృద్ధి చెందిన పట్టణ నడిబొడ్డున కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి పరుల పాలవుతుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
కోర్టులో కేసు నడుస్తున్నా..
గతంలోనూ ఇదే భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకొన్నారు. దీనిపై సదరు వ్యక్తులకు రెవెన్యూ శాఖ మధ్య డబ్ల్యూపీ నెంబర్ 30275/2021 కింద హైకోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇందులో ఎవరూ ప్రవేశించరాదంటూ రెవెన్యూ శాఖ ఓ బోర్డును రాయించింది. అయితే సదరు బోర్డును నేటి వరకు సదరు భూమిలో ఏర్పాటు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నాలుగేళ్లు గడిచే సరికి మళ్లీ సదరు వ్యక్తులో, ఇతరులో భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. విలువైన భూమిని అధికారులు పరిరక్షించి, ప్రజా అవసరాలకు వినియోగించాల్సి ఉంది.
ప్రభుత్వ భూమి.. దర్జాగా కబ్జా
ప్రభుత్వ భూమి.. దర్జాగా కబ్జా