అక్రమాల ‘ఉపాధి’! | - | Sakshi
Sakshi News home page

అక్రమాల ‘ఉపాధి’!

Aug 6 2025 6:40 AM | Updated on Aug 6 2025 6:40 AM

అక్రమ

అక్రమాల ‘ఉపాధి’!

జిల్లా సమాచారం

జాబ్‌ కార్డులు – 2,67,000

వేతనదారులు – 4,79,000

అవసరానికి అనుగుణంగా

హాజరయ్యేవారు – 2-3 లక్షల మంది

రోజూ పనిచేస్తున్న కూలీలు – 35 వేల మంది

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఉపాధి హామీ నిధులను అడ్డంగా దోచేస్తున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు తమ ముఖ్యఅనుచరులనే క్షేత్ర సహాయకులుగా నియమించుకున్నారు. బంధువులు, అనుచరుల పేరుతో నకిలీ మస్టర్లు సృష్టించి వారంవారం రూ.వేలల్లో లబ్ధిపొందుతున్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లి, కుప్పం, పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి, వి.కోట, పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండలాల్లో కేరళ, బెంగళూరు, చైన్నె, తిరుపతి, ముంబయి వంటి ప్రాంతాల్లో స్థిరపడినవారి పేర్లను పొందుపరిచి ఉపాధి నిధులను కాజేస్తున్నట్టు సమాచారం. జిల్లా డ్వామా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమదారులు సాంకేతికతకు బురిడీ కొట్టిస్తున్నారు.

ఆశయానికి తూట్లు

ఉపాధి పథకం కూటమి నేతలకు కల్పతరువుగా మారింది. అవినీతి, అక్రమాలు మితిమీరి పోతున్నాయి. సామాజిక తనిఖీల్లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. పథకంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుంటున్న క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు కొందరు నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. చట్టప్రకారం దుర్వినియోగమయ్యే సొమ్మును రికవరీ చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

దొంగ మస్టర్ల దందా

ఉపాధి హామీ పనుల్లో దొంగ మస్టర్ల దందా ఆగడం లేదు. చేయని పనులకు డబ్బులు తీసుకునే వారు కొందరైతే, ఎక్కువ మస్టర్లు చూపించి ప్రజాధనాన్ని లూటీ చేసేవారు మరికొందరు. గత ఏడాదిగా అడ్డగోలు పనులకు అలవాటు పడిన కొందరు కూలీల పేర్లతో బోగస్‌ మస్టర్లు సృష్టించి స్వాహా చేస్తున్నారు. చేయని పనులకు సైతం రికార్డులు సృష్టించడం, యంత్రాలతో పనులు చేసి బిల్లులు పెట్టడం వంటివి సర్వసాధారణమైపోయాయి.

10 నుంచి ఏఐ ఆధారిత ముఖ హాజరు

నేషనల్‌ మస్టర్‌ మానిటరింగ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) ఆధ్వర్యంలో ఫేస్‌ అటెండెన్స్‌ ఉన్నప్పటికీ జిల్లాలో దొంగ మస్టర్లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాలో ఏఐ ఆధారిత ముఖ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు జిల్లా డ్వామా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రభుత్వ సొమ్మును దోచేస్తున్న దొంగ మస్టర్లు

పేద కూలీల కడుపుకొడుతున్న కేటుగాళ్లు

10 నుంచి ఏఐ ఆధారిత ముఖ హాజరు

కసరత్తు చేస్తున్న జిల్లా డ్వామా శాఖ అధికారులు

యంత్రాలతో పనులు చేస్తున్నారు

యంత్రాలతో ఉపాధి పనులు చేస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో కూలీలు పనులు కావాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. యంత్రాలతో పనులు చేసేందుకు కూలీలకు పనులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. వారం, వారం ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వడం లేదు. ఉపాధి పనుల్లో జరుగుతున్న అవినీతి పై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి వహించాలి.

– వాడ గంగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి.

అందరూ బాధ్యులే

క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం బాధ్యత వహించాలనే వాదనలున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులకు వాటాల రూపంలో ముడుపులు అందుతుండడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. నామమాత్రంగా కింది స్థాయి సిబ్బంది పై వేటు వేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉపాధి అక్రమాలపై మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఏపీవోలు సైతం బాధ్యత వహించాలనే డిమాండ్లు వస్తున్నారు. కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా బిల్లులు మంజూరు చేస్తూ.. అందినకాడికి దండుకోవడం పరిపాటిగా మారింది.

అక్రమాల ‘ఉపాధి’!1
1/2

అక్రమాల ‘ఉపాధి’!

అక్రమాల ‘ఉపాధి’!2
2/2

అక్రమాల ‘ఉపాధి’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement