
సాంకేతికతకు అనుగుణంగా మార్పులు
చిత్తూరు కలెక్టరేట్ : అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు అవసరమని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సమగ్రశిక్షాశాఖ, రాష్ట్రీయ సేవాసమితి ఆధ్వర్యంలో ఓసాట్ డిజిటల్ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతికతను బట్టి విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమన్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని అభివృద్ధి చేసి పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ఓసాట్ సంస్థ జిల్లాలోని కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో 22 ప్రభుత్వ పా ఠశాలలను ఎంపిక చేసుకుని ఓసాట్ డిజిటల్ స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఎంపిక చేసిన పాఠశాల ల టీచర్లకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఎంపిక చేసిన పాఠశాలలకు 3 ల్యాప్‌టాప్స్, 25 ట్యాబ్‌లను అందించారు. సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ, రాస్ సంస్థ ప్రధాన కార్యద ర్శి వెంకటరత్నం, ఓసాట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ పాల్గొన్నారు.
పల్టీలు కొట్టిన కారు.. తప్పిన ప్రమాదం
ఐరాల : మద్దిపట్లపల్లె సమీపంలోని వ్యవసాయ బావి అంచున ఓ కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ చేతికి గాయం కాగా పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం మేరకు.. కడప జిల్లా ఖాజీపేటకు చెందిన పరమేశ్వర్, సుధాకర్, మరో ఇద్దరు స్నేహితులు బుధవారం తమ స్వగ్రామం నుంచి కారులో కాణిపాకానికి బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని మద్దిపట్లపల్లె సమీపంలోని చెరువు కట్టపై మలుపు వద్ద కారు డ్రైవింగ్ చేస్తున్న పరమేశ్వర్ నిద్ర మత్తుతో అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావి అంచున కారు బోల్తా కొట్టింది. దీంతో పరమేశ్వర్‌కు చేతికి గాయం కావడంతో పాటు కారు నుజునుజ్జు అయ్యింది. మిగతా వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది నవంబర్ 28వ తేదీ ఇద్దరు విద్యార్థులు ద్విచక్ర వాహనంలో వెళ్తూ ఈ బావిలో పడి ఒకరు మృతి చెందగా మరొక విద్యార్థి క్షేమంగా బయటపడ్డాడు. చెరువు కట్టపై ఉన్న మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సెలవుపై చిత్తూరు ఎస్పీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యక్తిగత కారణాల రీత్యా సెలవులు తీసుకోనున్నారు. గురువారం నుంచి వారం రోజులపాటు సెలవులో వెళ్లనున్నారు. అప్పటి వరకు ఇన్‌చార్జ్‌గా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.