
ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. రెండు రోజులుగా ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. పాళెం పంచాయతీలోని అటవీ సమీప ప్రాంతం చింతల వంకలో తిష్టవేసి పగలంతా అక్కడే ఉండి రాత్రి పూట సమీప గ్రామాల్లోని పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని కుమ్మరపల్లె, జూపల్లె, పాళెం, కోటపల్లె పరిసర ప్రాంతాల్లోని మామిడి, అరటి, టమాట, మామిడి తోపుల చుట్టూ వేసిన ఇనుప కంచి, కూసాలను విరిచేశాయి. పొలాల వద్దకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
మూలస్థాన ఎల్లమ్మ
పాలక మండలికి దరఖాస్తులు
చంద్రగిరి: చంద్రగిరి గ్రామదేవత శ్రీమూలస్థాన ఎల్లమ్మ ఆలయ నూతన ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ నుంచి 20 రోజుల లోపు దేవాదాయ ధర్మదాయశాఖ జిల్లా కార్యాలయంలో నేరుగా కానీ, రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్ కాపీ, రెండు పాసుపోర్టు సైజ్ ఫొటోలు, అఫిడవిట్ జతపరచాలని పేర్కొన్నారు.