
ఆలయాల్లో దొంగలుపడ్డారు!
పలమనేరు: నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో దొంగలు పడ్డారు. ఇటీవల మండల కేంద్రమైన బైరెడ్డిపల్లి గంగమ్మ ఆలయంలో రూ.2 లక్షల విలువైన అమ్మవారి మంగళ సూత్రాన్ని చోరీచేశారు. తాజాగా గురువారం రాత్రి పలమనేరు మండలంలోని గొల్లపల్లి గంగమ్మ ఆలయంలో రూ.3 లక్షల దాకా దోచుకెళ్లారు. అర్ధరాత్రిలో కొందరు యువకులు ఆటోలో వచ్చి ఆలయంలో చోరీచేసి వెళ్తుండగా స్థానికులు గమనించి వారిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. కాగా టీనేజర్ దొంగలైన వీరు పెద్దపంజాణి మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. జల్సాల కోసం వీరు ఇలా ఆలయాల్లో చోరీలను ఎంచుకున్నట్టు సమాచారం. వీరి ద్వారా మిగిలిన దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దోచుకెళ్లినా పట్టుకోరా?
ఇటీవల బైరెడ్డిపల్లి పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బాటగంగమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారాన్ని తీసి లోపల అమ్మవారి మెడలోని బంగారు మంగళ సూత్రాన్ని చోరీచేశారు. ఈ కేసును అక్కడి పోలీసులు ఇప్పటిదాకా ఛేదించలేదు. ఆరు నెలల క్రితం పలమనేరు మండలంలోని ముసలిమొడుగు ప్రాంతం గుడియాత్తం రోడ్డులోని రహదారి పక్కనున్న పలు ఆలయాల్లో హుండీలను ధ్వంసం చేసి నగదును దోచుకెళ్లారు. ఈ చోరీలకు పాల్పడిన దొంగలను ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మొన్న బైరెడ్డిపల్లి గంగమ్మ
ఆలయంలో చోరీ
తాజాగా గొల్లపల్లి గంగమ్మ ఆలయంలో..
ఇప్పటికే ఏడు ఆలయాల్లో దోపిడీ