
సీకాం డిగ్రీ కళాశాలకు ‘అటానమస్’
తిరుపతి సిటీ : అన్నమయ్య సర్కిల్‌లోని సీకాం డిగ్రీ కళాశాల మరో మైలురాయిని దాటింది. కళాశాలకు అటానమస్ హోదా లభించిందని విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ టి.సురేంద్రనాథ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇటీవలే నాక్ బీ ప్లస్ ప్లస్ గ్రేడ్ సాధించామని, అటానమస్ కోసం దరఖాస్తు చేసుకోగా యూజీసీ మా కళాశాలలో విద్యా నాణ్యతా ప్రమాణాలను, మౌలిక వసతులను పరిశీలించి హోదా కల్పించిందన్నారు. తిరుపతిలో అటానమస్ హోదా పొందిన తొలి డిగ్రీ కళాశాలగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బందికి అధ్యక్షులు జయలక్ష్మి, డైరెక్టర్ ప్రణీత్ స్వరూప్, తేజ స్వరూప్ అభినందనలు తెలిపారు.
బోధనేతర సిబ్బంది
సమస్యలు పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇంటర్మీడియట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఆ అసోసియేషన్ నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇంటర్మీడియట్ డీఐఈవో రఘుపతిని కలిసి సత్కరించారు. అనంతరం క్షేత్ర స్థాయిలో నాన్ టీచింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీఐఈవో చర్చించారు. ప్రభుత్వం దృష్టికి నాన్‌టీచింగ్ ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఉద్యోగోన్నతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సెబాస్టియన్, ట్రెజరర్ మునిచంద్ర, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రమౌళి, సూపరింటెండెంట్ హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం
– అడ్డుకుని జేసీబీని సీజ్ చేసిన తహసీల్దార్
పూతలపట్టు(యాదమరి) : అక్రమంగా మట్టిని తరలించే క్రమంలో ప్రభుత్వ భూమిలో చదును చేస్తున్న జేసీబీని సీజ్ చేసినట్లు తహసీల్దార్ రమేష్‌బాబు చెప్పారు. మండల పరిధి పి.కొత్తకోట రెవెన్యూ పరిధి టీ.కె.పల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వ సానుభూతిపరుడైన ఓ వ్యక్తి గత కొద్ది రోజులుగా అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే కమ్మగుట్ట సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని బుధవారం జేసీబీతో చదును చేయడం మొదలు పెట్టగా గమనించిన గ్రామస్తులు స్థానిక తహసీల్దార్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి జేసీబీని సీజ్ చేశారు.

సీకాం డిగ్రీ కళాశాలకు ‘అటానమస్’

సీకాం డిగ్రీ కళాశాలకు ‘అటానమస్’