
జిల్లా స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
నగరి : జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు నగరి మండలం, నాగరాజకుప్పం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మహిళా జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో నాగరాజకుప్పం జెడ్పీహెచ్‌ఎస్‌లో 10వ తరగతి చదివే నికాస్, జ్యోష్న, 9వ తరగతి చదివే విమల్ ప్రతిభ కనభరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మనాభ రాజు, పీడీ గోపి, ఉపాధ్యాయులు అభినందించారు.
నేడు విద్యుత్ గ్రీవెన్స్
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక గాంధీ రోడ్డులోని ట్రాన్స్‌కో అర్బన్ ఈఈ కార్యాలయంలో ఉదయం 10.30కు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
రూ.51.97 కోట్ల ఆదాయం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా గత నాలుగు నెలల్లో రూ.51.97 కోట్ల ఆదాయం వచ్చినట్టు జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు గాను ఆదాయ లక్ష్యం రూ.73.08 కోట్లుగా నిర్దేశించగా అందులో రూ.51.97 కోట్లు వసూళ్లతో 72.2 శాతం లక్ష్యం చేరుకున్నట్లు వివరించారు. గత ఏడాది ఇదే ఈ నాలుగు నెలల్లో రూ.41.31 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 25 శాతం వృద్ధి సాధించామని వివరించారు.
దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హులైన విద్యార్థులు పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తులను చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆదర్శప్రాయమైన పనులు, జాతీయ స్థాయిలో క్రీడలు, సంఘసేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఆర్ట్స్, లలితకళలు, వినూత్నమైన సేవల్లో అత్యుత్తమ ప్రతిభచాటిన 18 ఏళ్లలోపు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 15వ తేదీలోపు www.awards.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.