తప్పు చేస్తే వేటు తప్పదు: ఆర్జేడీ
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీల పాయింట్ల విషయంలో అలసత్వం వద్దని తప్పులు చేసే వేటు ఖాయమని వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన సోమవారం డీఈవో కార్యాలయం పక్కనున్న పాఠశాలలో నిర్వహిస్తున్న బదిలీల కసరత్తును పరిశీలించారు. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బదిలీల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. బదిలీల పాయింట్ల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. కొందరి ఎంఈవోలపై ఫిర్యాదులు అందుతున్నాయని, తీరు మార్చుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఈవో వరలక్ష్మి, ఏడీలు వెంకటేశ్వరరావు, సుకుమార్, పలు మండలాల ఎంఈవోలు పాల్గొన్నారు.
టీచర్లకు న్యాయం చేయాలి
పీఎస్ హెచ్‌ఎం బదిలీల్లో నష్టపోయిన నలుగురు టీచర్లకు న్యాయం చేయాలని ఆర్జేడీని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ కోరారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు ఆర్జేడీకి వినతిపత్రం అందజేశారు. ఆయన ఆర్జేడీతో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు స్పౌజ్ ఉన్న వారికి స్పౌజ్ పాయింట్లు వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మణిగండన్, ఇతర నాయకులు సుధాకర్‌రెడ్డి, ఎస్పీ భాషా, రెడ్డెప్ప, శేఖర్ పాల్గొన్నారు.


