
ఆందోళన కలిగిస్తున్న వలసలు
అనుకూల వాతావరణం లేకపోవడం వల్లే
ఉదైతి ఫౌండేషన్, క్వెస్‌కార్ప్ నివేదిక
ముంబై: కార్మిక, నైపుణ్య ఉద్యోగాల్లో (బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాలు) మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. అదే సమయంలో చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉద్యోగం వీడుతుండడం (వలసల రేటు/అట్రిషన్) ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం 19 శాతానికి పెరిగింది. 2020–21 నాటికి వీరి భాగస్వామ్యం 16 శాతంగా ఉండడం గమనార్హం. కానీ, వలసలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.
ముఖ్యంగా ఏడాది లోపు అనుభవం ఉన్న మహిళల ఎక్కువగా ఉద్యోగం మానేస్తున్నారు. ఈ వివరాలను ఉదైతి ఫౌండేషన్, క్వెస్‌కార్ప్ నివేదిక వెల్లడించింది. రిటైల్, తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ, సేవల రంగాల్లో ఉద్యోగం చేస్తున్న 10,000 మంది మహిళలతోపాటు, ఉద్యోగం మానేసిన 1,500 మందిని సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది. వలసలు ఎక్కువగా ఉండడం ఉత్పాదకతకు, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్వప్న సాకారానికి విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
మహిళల అభిప్రాయాలు..
వచ్చే 12 నెలల్లో ఉద్యోగం వీడనున్నట్టు ఏడాది లోపు అనుభవం ఉన్న 52 శాతం మహిళా ఉద్యోగులు సర్వేలో తెలిపారు. అదే రెండేళ్లకు పైగా అనుభవం ఉన్న వారిలో ఇలా చెప్పిన వారు 3 శాతంగానే ఉండడం గమనార్హం. వలసల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లోనూ 54 శాతం తమ వేతనం విషయమై సంతృప్తిగా లేరు.
80 శాతం మంది నెలకి రూ. 2,000 కన్నా తక్కువే పొదుపు చేస్తున్నారు. మంచి వేతనం ఇస్తే ఉద్యోగాల్లో తిరిగి చేరతామని 42 శాతం మంది చెప్పారు. 57 శాతం మంది రవాణా పరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటే, 11 శాతం మంది రాత్రి షిఫ్టుల్లో పని ప్రదేశానికి వెళ్లి రావడాన్ని భద్రంగా భావించడం లేదు. రూ.20వేల కంటే అధిక వేతనం పొందుతున్న వారు సమీప కాలంలో ఉద్యోగం విడిచి పెట్టిపోవడం 21 శాతం తక్కువగా ఉండొచ్చన్నది ఈ నివేదిక సారాంశం.
వ్యవస్థలోనే లోపం..
‘‘భారత్ ఆర్థిక సామర్థ్యాల విస్తరణకు అద్భుతమైన అవకాశాలున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలకు ద్వారాలు తెరిచాం. కానీ, వారికి అనుకూలమైన వ్యవస్థల ఏర్పాటుతోనే వృద్ధి చెందగలరు. సామర్థ్యాలు లేకపోవడం వల్ల మహిళల ఉద్యోగాలు వీడడం లేదు. మహిళలు పనిచేసేందుకు, విజయాలు సాధించేందుకు అనుకూలమైన వసతులను మనం కలి్పంచలేకపోతున్నాం’’అని ఉదైతి ఫౌండేషన్ సీఈవో పూజ గోయల్ వివరించారు.