సామాన్యుల జీవితాల్లో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక భరోసా. ఇటీవల తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో తెరపైకి వచ్చిన ‘8 గ్రాముల బంగారం’ హామీ ఇప్పుడు బులియన్ మార్కెట్, ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ఈ 8 గ్రాముల సంఖ్య వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ ఎంత? అన్న వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఎందుకు 8 గ్రాములు?
దక్షిణ భారతదేశంలో బంగారాన్ని గ్రాముల కంటే ‘సవరం’ లెక్కన కొలవడం ఒక ఆనవాయితీ. 8 గ్రాముల బంగారాన్ని ఒక సవరంగా పిలుస్తారు. వివాహ సమయంలో ‘మంగళసూత్రం’ (తాళి) తయారు చేయడానికి కనీసం ఒక సవరం బంగారం ఉండాలని సెంటిమెంట్‌గా భావిస్తారు.
ఒక మధ్యతరగతి లేదా పేద కుటుంబానికి వివాహ ఖర్చుల్లో అతిపెద్ద భారం బంగారం. ప్రభుత్వం సరిగ్గా ఒక సవరం (8 గ్రాములు) హామీ ఇవ్వడం ద్వారా, ఆ కుటుంబానికి ప్రాథమిక వివాహ అవసరాన్ని తీర్చినట్లు అవుతుందనేది ఈ సంఖ్య వెనుక ఉన్న వ్యూహం.
నేరుగా బంగారమే ఇస్తారా? నగదు ఇస్తారా?
హామీల అమలు తీరు ఆయా పార్టీల విధానాలపై ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో సీఎం విజయ్ పార్టీ టీవీకే (Vijay TVK ) తమ హామీలో నేరుగా 8 గ్రాముల బంగారంతోపాటు పట్టుచీరను అందిస్తామని పేర్కొన్నాయి. గతంలో జయలలిత హయాంలో కూడా లబ్ధిదారులకు బంగారు నాణేలనే పంపిణీ చేసేవారు.
అయితే, బంగారం పంపిణీలో నాణ్యత లోపాలు, అవినీతి వంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉండటంతో.. అస్సాం వంటి రాష్ట్రాలు ‘అరుంధతి’ పథకం కింద బంగారం కొనుగోలుకు సరిపడా నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి నిర్వహణ పరంగా సులభతరం అవుతుంది.
ఎన్ని క్యారెట్లు ఇస్తారు?
సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి పథకాల కింద 22 క్యారెట్ల బంగారాన్నే పంపిణీ చేస్తాయి. మన దేశంలో మంగళసూత్రాలు లేదా ఇతర ఆభరణాలను 22 క్యారెట్ల బంగారంతోనే తయారు చేస్తారు. ఇది ఆభరణాలకు అవసరమైన గట్టిదనాన్ని కలిగి ఉంటుంది. గతంలో ఇదే తమిళనాడు ప్రభుత్వం అమలు చేసిన 'తాళికి తంగం' పథకం కింద లబ్ధిదారులకు 22 క్యారెట్ల బంగారు నాణేలనే (Gold Coins) పంపిణీ చేసేవారు. విజయ్ పార్టీ హామీ కూడా అదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంది.
ఇక ధరల పరంగా చూసినా 24 క్యారెట్లతో పోలిస్తే 22 క్యారెట్ల ధర గ్రాముకు సుమారు రూ.1000 పైనే వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం (మే 10, 2026 నాటికి) 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,150 ఉంది. అంటే 8 గ్రాములకు రూ.1,13,200 అవుతుంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాముకు రూ.15,437 ఉంది. ఇది 8 గ్రాములకు రూ.1,23,864 అవుతుంది. ప్రభుత్వం లక్షలాది మందికి పంపిణీ చేసేటప్పుడు, ఈ ధరల వ్యత్యాసం బడ్జెట్‌పై వందల కోట్ల ప్రభావం చూపుతుంది.


