స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఏది బెటర్‌..?

Which Fund Is Better Between Small And Mid Cap Funds - Sakshi

స్మాల్‌ క్యాప్‌ కంటే మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం చేయడం మంచిదా?     – వరుణ్‌ 

మిడ్‌క్యాప్‌లో ఉండే రాబడులు, సవాళ్లు అనేవి స్మాల్‌క్యాప్‌ మాదిరే ఉంటాయి. పేరుకు తగినట్టుగా ఈ పథకాల పెట్టుబడులు ఉండటాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్‌ పథకాలు ఎక్కువ మొత్తాన్ని మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అదే విధంగా స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనూ చెప్పకోతగ్గ పెట్టుబడులు కలిగి ఉంటాయి. అదే స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ అయితే ఎక్కువగా స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌కు పెట్టుబడులు కేటాయిస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఎక్స్‌పోజర్‌ తీసుకుంటుంది. మార్కెట్‌ విలువ పరంగా టాప్‌ –100 కంపెనీలను లార్జ్‌క్యాప్‌గా, తదుపరి 150 కంపెనీలను మిడ్‌క్యాప్‌గా, మిగిలిన కంపెనీలను స్మాల్‌క్యాప్‌ కంపెనీలుగా సెబీ నిర్వచించింది. ఈ నిర్వచనాన్నే పథకాలు కూడా అనుసరిస్తుంటాయి.

మార్కెట్‌ విలువ ఆధారంగా ఒక కంపెనీని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ అని చెప్పడమే. ఒకవేళ అది చిన్న కంపెనీయే అయినప్పటికీ గొప్పది అయి ఉండొచ్చు. చక్కని నిర్వహణతో, ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారంతో, భరోసానిస్తూ ఉండొచ్చు. ఇలాంటి అంశాలున్న కంపెనీల విషయంలో అది మిడ్‌ లేదా స్మాల్‌ క్యాప్‌ అన్న నిర్వచనం జోలికి వెళ్లక్కర్లేదు. ఉదాహరణకు ఒక మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కొంత కాలానికి నిర్వహణ ఆస్తుల పరంగా అది పెద్ద పథకంగా మారొచ్చు. అప్పుడు అది పేరుకు మిడ్‌క్యాప్‌ అయినప్పటికీ లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఎక్కువగా పెట్టుబడులు కలిగి ఉంటుంది. పేరుకు మిడ్‌క్యాప్‌ కంపెనీలుగా ఉన్నప్పటికీ, పోర్ట్‌ఫోలియోలని చాలా కంపెనీలు భవిష్యత్తులో లార్జ్‌క్యాప్‌గా మారే అవకాశాలు ఉంటాయి.  

నేను ఆదాయపన్ను 30 శాతం శ్లాబు పరిధిలోకి వస్తాను. దీంతో అత్యవసర నిధిని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి?       – శివ్‌ గణేశన్‌  

మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్‌ ఫండ్‌ లేదా అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అయితే ఏటేటా వడ్డీ ఆదాయం పన్ను చెల్లింపుదారు ఆదాయానికి కలుస్తుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను ఆధారపడి ఉంటుంది.

అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపైనా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులను విక్రయించినప్పుడు కూడా నమోదయ్యే లాభంపై ఇంతే మేర పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్‌డీలతో పోలిస్తే డెట్‌ ఫండ్స్‌ కాస్త మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, డెట్‌ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ మాదిరి పెట్టుబడులకు రక్షణ హామీ కూడా ఉండదు. అయినా కానీ, లిక్విడ్‌ ఫండ్స్, అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ తక్కువ రిస్క్‌ విభాగంలోకి వస్తాయి. నాణ్యమైన డెట్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసిన పథకాన్నే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రిస్క్‌ తీసుకున్నట్టు అవుతుంది.  
 

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top