
ఆఫీసులో పని ఒత్తిడి ఒక ఎత్తయితే.. ట్రాఫిక్ సంద్రాన్ని ఈదుకుంటూ వెళ్లడం మరొక ఎత్తు. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ప్రతిరోజూ ఛేదించుకుంటూ వెళ్లే నగరవాసి కనీసం వారాంతంలోనైనా కుటుంబం, స్నేహితులతో స్వచ్ఛమైన ఆహ్లాదకర వాతావరణంలో గడపాలని కోరుకుంటున్నాడు. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే ఫామ్ హౌస్‌లు నిర్మితమవుతున్నాయి. గతంలో ఫామ్‌హౌస్‌ల కోసం కేవలం సంపన్న వర్గాలు మాత్రమే మొగ్గు చూపేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి సామాన్య, మధ్యతరగతి సైతం వ్యవసాయ క్షేత్రాలకు ఆసక్తి చూపిస్తున్నారు. -సాక్షి, సిటీబ్యూరో
కొందరు 200 నుంచి వెయ్యి గజాల్లోపు భూమిని కొనుగోలు సాదాసీదాగా ఫామ్‌హౌస్‌లను నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లే అవుట్లలో స్థలాలను కొని బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.
ఔటర్ వెలుపలే..
నగరం ఓఆర్‌ఆర్ వరకు విస్తరించింది. చేవెళ్ల, వికారాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్, శామీర్‌పేట, భువనగిరి, శంషాబాద్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లోని వీకెండ్ హోమ్స్‌కు ఆదరణ ఎక్కువగా ఉంది. భూముల ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ.. వాతావరణం బాగుంటుందని, భవిష్యత్తులో ఆస్తిని విక్రయిస్తే మంచి ధర పలుకుతుందనే విశ్వాసంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తిని పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.
బిల్డర్లు కూడా..
రియల్ ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. వారాంతాల్లో విడిది చేసేలా సకల సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. కొందరు తమ ఇళ్లను మిగతా సమయంలో కమ్యూనిటీ నిర్వహణ సంస్థలకే అద్దెకు ఇస్తున్నారు. కమ్యూనిటీల్లోని సభ్యులు చిన్న వేడుకలను ఇక్కడ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతర ఇళ్లను ఒకటి రెండు రోజులకు అద్దెకు తీసుకుంటున్నారు. ఈ రకంగా ఖాళీగా ఉండకుండా ఆదాయం వస్తుండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది.