హోమ్‌లోన్‌కు రక్షణ.. పొందండి ఇలా

Useful Tips For Hassle free Payment Of Home Loan - Sakshi

గృహ రుణం తీసుకుంటున్నామంటే దీర్ఘకాలం పాటు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నట్టు అర్థం చేసుకోవాలి. ఆ రుణాన్ని 10–20 ఏళ్లపాటు చెల్లించేందుకు ఆర్థికంగా, భౌతికంగా, భావోద్వేగ పరంగా సన్నద్ధులై ఉండాలి. ఇలా దీర్ఘకాలం పాటు రుణ చెల్లింపుల ఒప్పందంలోకి ప్రవేశించిన తర్వాత.. దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి రుణ గ్రహీత మరణిస్తే.. లేదా రుణ గ్రహీత ఆదాయం నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రుణం తీసుకునే వ్యక్తి తనకు ఏదైనా జరిగితే తన కుటుంబంపై రుణం తీర్చాల్సిన ఆర్థిక భారం పడుతుందన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి భిన్న పరిస్థితుల్లో గృహ రుణం చెల్లింపులు ఆగిపోకుండా సజావుగా చెల్లించేలా చూసుకునేందుకు మార్గాలున్నాయి.  

రుణంపై బీమా కవరేజీ 
గృహ రుణం ఇచ్చే సమయంలోనే కొన్ని సంస్థలు ఇన్సూరెన్స్‌ కవరేజీ కూడా తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ కవరేజీతో చెల్లింపులకు రక్షణ ఏర్పడుతుంది. సాధారణంగా హోమ్‌లోన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ (హెచ్‌ఎల్‌పీపీ) అన్నది మీరు తీసుకునే గృహ రుణం విలువకు సమానంగా ఉంటుంది. ఇలా కాకుండా వ్యక్తిగతంగానూ రుణ గ్రహీత టర్మ్‌ కవరేజీ ప్లాన్‌ను తీసుకోవచ్చు. రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారనుకోండి. అప్పుడు హెచ్‌ఎల్‌పీపీ కూడా రూ.25 లక్షల కవరేజీతో వస్తుంది. ఇందుకు ప్రీమియం కింద సుమారు రూ.86,335 చెల్లించాల్సి వస్తుంది. ఒక ఏడాది తర్వాత చెల్లించాల్సిన గృహ రుణం రూ.20.5 లక్షలకు తగ్గిందనుకుందాం. ఆ సమయంలో రుణ గ్రహీత మరణిస్తే బీమా సంస్థే పాలసీదారు తరఫున మిగిలిన గృహ రుణ బకాయిని పూర్తిగా తీర్చేస్తుంది.  

టర్మ్‌ కవరేజీ 
టర్మ్‌ కవరేజీని విడిగా తీసుకోవడం వల్ల పాలసీదారుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పైన చెప్పుకున్నట్టుగానే రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్న ఏడాది తర్వాత రుణ గ్రహీత మరణించించినట్టయితే.. రూ.25 లక్షల టర్మ్‌ ప్లాన్‌ పూర్తి మొత్తాన్ని పొందొచ్చు. అంటే మిగిలిన రుణ బకాయి రూ.20.5 లక్షలుపోను రూ.4.5 లక్షలను రుణ గ్రహీత కుటుంబం అందుకోవచ్చు. ప్రీమియం చెల్లింపుల పరంగా హెచ్‌ఎల్‌పీపీతో పోలిస్తే టర్మ్‌ ప్లాన్‌ సౌకర్యంగా ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని రుణం తీసుకునే సమయంలోనే చెల్లించాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్‌ బీమా ప్లాన్‌ మాదిరే క్రమానుగతంగా ప్రీమియం చెల్లించుకునే ఆప్షన్‌ ఉంటుంది. కనుక హెచ్‌ఎల్‌పీపీ, టర్మ్‌ప్లాన్‌లో అనుకూలమైన దానిని రుణ గ్రహీత ఎంపిక చేసుకోవచ్చు.  

అత్యవసర నిధి 
బీమా కవరేజీ తీసుకుని హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంటే సరిపోదు. ప్రతీ నెలా ఈఎంఐ చెల్లించాల్సిన బాధ్యత నేపథ్యంలో అత్యవసర పరిస్థితులకు సన్నద్ధమై ఉండాలి. గృహ రుణం మాదిరి పెద్ద మొత్తంలో రుణ బాధ్యతను మోస్తున్నప్పుడు.. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా, గృహ రుణం ఈఎంఐలకు చెల్లింపులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరం. కనుక లిక్విడ్‌ ఫండ్స్‌లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలి. దీనివల్ల పెట్టుబడులపై రాబడులకుతోడు.. నిర్ణీత కాలంలో ఒక నిధి ఏర్పడుతుంది. ఈ చిన్న అడుగులతో గృహ రుణ బాధ్యత విషయంలో భద్రతను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థతులు తలెత్తినా అప్పుడు మీరు కంగారు పడిపోవక్కర్లేదు. మీ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లకుండా కాపాడినట్టు అవుతుంది. గృహ రుణం ఈఎంఐను క్రమం తప్పకుండా చెల్లించినట్టయితే మంచి క్రెడిట్‌ స్కోర్‌ కూడా ఏర్పడుతుంది. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ అన్నది భవిష్యత్తులో రుణ అవసరాల్లో ఎంతో సాయపడుతుంది.  
 - అరవింద్‌ హాలి, మోతీలాల్‌ ఓస్వాల్‌ హోమ్‌ ఫైనాన్స్‌ ఎండీ, సీఈవో  

చదవండి: ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు.. తెలియకుండానే బోలెడంత లాస్‌!!
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top