భారతదేశం ఇంధన దిగుమతులను తగ్గించుకోవాలంటే.. బయోఫ్యూయల్ (జీవ ఇంధనం) మీద ఆధారపడాలని, దీనివల్ల దేశ ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని గడ్కరీ చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల దేశంలోని బయోఫ్యూయల్ కార్యక్రమాన్ని మరింత బలపరచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం.. ఇంధనాల్లో బయోఫ్యూయల్ మిశ్రమాన్ని పెంచేందుకు కొత్త ఫెడరల్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. దీని వల్ల ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు పండించే రైతులకు లాభం కలగనుంది.

పర్యావరణ పరిరక్షణ సంస్థ ఖరారు చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. బయోమాస్ ఆధారిత డీజిల్ మిశ్రమం 60 శాతానికి పైగా పెరుగుతుంది. ఈ ఇంధనాన్ని సాధారణంగా సోయాబీన్ నూనె, జంతువుల కొవ్వులు, ఇతర వ్యవసాయ ముడి పదార్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఈ సంస్థ గ్యాసోలిన్, డీజిల్ కోసం మొత్తం పునరుత్పాదక ఇంధన అవసరాలను కూడా పెంచింది. ఇందులో భాగంగానే 2026, 2027 సంవత్సరాలకు కొత్త లక్ష్యాలను నిర్దేశించింది.
బయోఫ్యూయల్ కార్యక్రమం వల్ల.. రైతుల నికర ఆదాయం 3 నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూక్ రోలిన్స్ వెల్లడించారు. అయితే దీనిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన రిఫైనరీలు ఈ విధానం వల్ల తమ ఖర్చులు పెరుగుతాయని అంటున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, సరఫరా సమస్యల కారణంగా ఇప్పటికే ఇంధన ధరలు ఒత్తిడిలో ఉన్నాయని, ఈ కొత్త నిబంధనలు మరింత భారాన్ని పెంచవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.


