మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రకటించిన ‘నౌకా దళ దిగ్బంధనం’ (నేవల్ బ్లాకేడ్) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో పాటు శాంతి స్థాపన కోసం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది.
యురేనియం తరలింపునకు ప్రతిపాదన
ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు కలిగిన రష్యా, ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడానికి కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను రష్యాకు తరలించడం ద్వారా అగ్రరాజ్యంతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని క్రెమ్లిన్ సూచించింది. ‘ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పుతిన్ గతంలోనే అమెరికా ముందు ఉంచారు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడానికి రష్యా మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
హార్మూజ్ జలసంధి.. ట్రంప్ కఠిన నిర్ణయం
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో అమెరికా తన తదుపరి వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సోమవారం నుంచి ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్ ఓడరేవులకు వచ్చే లేదా అక్కడి నుంచి వెళ్లే అన్ని రకాల నౌకలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటం అంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేసే అవకాశం ఉంది.
అయితే, ఈ దిగ్బంధనాన్ని అమెరికా సైన్యం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, ఇరాన్ సైన్యం ఈ చర్యను పైరసీగా అభివర్ణించింది.
యుద్ధం ముగిసేది ఎప్పుడు?
ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు చర్చలు విఫలమవ్వడంతో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఇరాన్ తన స్నేహపూర్వక దేశాలైన చైనా వంటి ప్రాంతాలకు మాత్రమే చమురు నౌకలను అనుమతిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ముందుకొస్తున్నా అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే ప్రపంచం భారీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన..


