దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలోని నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు ఫేజ్-2, సెక్టార్-60 పరిసరాల్లో వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కరించలేని కార్మికుల డిమాండ్లు ఈ నిరసనలకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్మికులు డిమాండ్లు కింద తెలియజేశాం.
వేతనాల పెంపు
ప్రస్తుతం నోయిడాలోని పారిశ్రామిక కార్మికులు నెలకు రూ.13,000 నుంచి రూ.15,000 మధ్య చెల్లిస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని వారు వాపోతున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని పట్టుబడుతున్నారు. ‘పదేళ్లుగా ధరలు పెరిగాయి కానీ, మా శ్రమకు దక్కే ఫలితం మాత్రం దక్కడం లేదు’ అని ఒక కార్మిక నేత ఆవేదన వ్యక్తం చేశారు.
హరియాణాతో పోలిక
ఈ నిరసనలకు ప్రధాన ప్రేరణ పొరుగు రాష్ట్రమైన హరియాణా తీసుకున్న నిర్ణయం. అక్కడి ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.14,000 నుంచి రూ.19,000కు (సుమారు 35 శాతం) పెంచింది. ఒకే పని చేస్తున్నా ఉత్తరప్రదేశ్ (నోయిడా) కార్మికులు హరియాణా కార్మికుల కంటే దాదాపు రూ.6,000 తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసమే అశాంతికి ఆజ్యం పోసింది.
12 గంటల షిఫ్టులకు స్వస్తి పలకాలి
హోసియరీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో కార్మిక చట్టాలను తుంగలో తొక్కి బలవంతంగా 12 గంటల పాటు పని చేయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పని గంటలను చట్టబద్ధమైన 8 గంటలకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు పనిని 'నిబంధన'గా కాకుండా, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ఓవర్ టైం, బోనస్ బకాయిలు
కార్మిక చట్టాల ప్రకారం, అదనపు గంటలు పనిచేసినప్పుడు సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వార్షిక బోనస్‌ల విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు.
పని ప్రదేశంలో భద్రత - గౌరవం
ఫ్యాక్టరీ లోపల కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని, మహిళా కార్మికులపై వేధింపులు అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం దీనికి స్పందిస్తూ, మహిళా అధికారిణి నేతృత్వంలో ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కచ్చితంగా అమలు కావాలని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపు
అనేక కంపెనీలు నెలల తరబడి వేతన బకాయిలను, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన సెటిల్‌మెంట్లను నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కష్టార్జితం తమకు దక్కకుండా యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నాయని, ఈ బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!


