అన్‌ సెక్యూర్డ్‌ రుణాలకే ఎక్కువ డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

అన్‌ సెక్యూర్డ్‌ రుణాలకే ఎక్కువ డిమాండ్‌

Published Fri, Jul 14 2023 5:44 AM

Unsecured loan portfolios growth highest, credit card NPAs shoot up - Sakshi

ముంబై: క్రెడిట్‌ కార్డులపై వసూలు కాని రుణాలు (ఎన్‌పీఏలు) 0.66 శాతం పెరిగి మార్చి నాటికి 2.94 శాతానికి చేరాయి. క్రెడిట్‌కార్డ్, వ్యక్తిగత రుణాల వాటా వేగంగా పెరుగుతున్నట్టు క్రెడిట్‌ సమాచార కంపెనీ ‘ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌’ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. రక్షణలేని రుణాలు పెరిగిపోతుండడంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సిబిల్‌ నివేదిక విడుదల కావడం గమనార్హం. మూడు నెలలకు మించి చెల్లింపులు లేని రుణాలను ఎన్‌పీఏలుగా పరిగణిస్తుంటారు.

ఇలా క్రెడిట్‌ కార్డులపై మూడు నెలలకు పైగా చెల్లింపులు చేయని రుణాల వాటా గత ఆర్థిక సంవత్సరంలో 0.66 శాతం పెరిగినట్టు, వ్యక్తిగత రుణాల్లో ఎన్‌పీఏలు 0.04 శాతం పెరిగి 0.94 శాతంగా ఉన్నట్టు సిబిల్‌ తెలిపింది. ఇక క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం పెరగ్గా, వ్యక్తిగత రుణాలు సైతం 29 శాతం వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ప్రాపర్టీపై ఇచ్చే రుణాలు (ఎల్‌ఏపీ) 38 శాతం పెరిగి అత్యంత వేగంగా వృద్ధి చెందిన రిటైల్‌ రుణ విభాగంగా ఉన్నట్టు వివరించింది. సాధారణంగా చిన్న వ్యాపార సంస్థలు తమ స్వల్పకాల నిధుల అవసరాల కోసం ప్రాపర్టీపై రుణాలను తీసుకుంటూ ఉంటాయి.  

గృహ రుణాలపై రేట్ల ప్రభావం
గృహ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 14 శాతమే వృద్ధి చెందాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ఈ విభాగంలో రుణాల వృద్ధి తక్కువగా నమోదైంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–మార్చి మూడు నెలల కాలాన్ని పరిశీలించినట్టయితే విలువ పరంగా ఫ్లాట్‌గా ఉంటే, సంఖ్యా పరంగా 11 శాతం తగ్గినట్టు సిబిల్‌ నివేదిక స్పష్టం చేసింది. ప్రాపర్టీ రేట్లతోపాటు, గృహ రుణాలపైనా రేట్లు పెరగడం ఈ పరిస్థితికి కారణంగా పేర్కొంది. ఆస్తుల నాణ్యతపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, కొత్త కస్టమర్లకు (అప్పటి వరకు రుణం తీసుకోని వారు) రుణాల విషయంలో రుణదాతలు దూరంగా ఉంటున్నట్టు తెలిపింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో అలాంటి కొత్త కస్టమర్లకు జారీ చేసిన రుణాల వాటా 16 శాతంగానే ఉందని, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 19 శాతంగా ఉన్నట్టు వివరించింది.

Advertisement
Advertisement