బ్రిటన్‌లో యువ ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా ఉంటాయనే విషయాన్ని 21 ఏళ్ల గ్రాడ్యుయేట్ ఖాలెద్ షరీఫ్ వెల్లడించారు. లండన్ శివార్లలోని కింగ్‌స్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిజిటల్ మీడియా టెక్నాలజీలో డిస్టింక్షన్‌తో పట్టభద్రుడైనప్పటికీ, అతనికి ఉద్యోగం దొరకలేదు.
ఖాలెద్ షరీఫ్ సుమారు 500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్కటి కూడా సాధించలేకపోవడం అతని నిరాశను పెంచింది. 100,000 పౌండ్లకు (రూ. కోటి కంటే ఎక్కువ) పైగా ఖర్చు పెట్టి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా అవకాశాలు లభించకపోవడం.. వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే భావన కలిగించింది.
ఈజిప్టులో జన్మించి, ఖతార్‌లో పెరిగి, 18 ఏళ్ల వయసులో లండన్‌కు వెళ్లిన షరీఫ్, బ్రిటిష్ రాజధాని తనకు వృత్తిపరంగా అవకాశాలను కల్పిస్తుందని ఆశించాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కోవిడ్19 ప్రభావం, కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి కూడా ఉద్యోగ అవకాశాల తగ్గుదలకు కారణమని అతను అభిప్రాయపడ్డాడు.
కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తూ కొత్త ఉద్యోగులను నియమించడాన్ని తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ, సాధారణ ఉద్యోగం చేసుకోవడం కంటే తన చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని అతను కోరుకుంటున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఖాలెద్ వెనుకడుగు వేయలేదు. ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ తన సృజనాత్మకతను కొనసాగిస్తున్నాడు.
ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''
అంతే కాకుండా.. ''జోక్'' అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించి, తన ఆసక్తులను వ్యాపారంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అనుభవం ప్రకారం.. యూనివర్సిటీలో నేర్చుకున్నదానికంటే.. స్వయంగా నేర్చుకున్న నైపుణ్యాలే వృత్తిలో ఎక్కువ ఉపయోగపడుతున్నాయి.


