
టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ముంగిటకు కనీవినీ ఎరుగని జీతం ప్రతిపాదన వచ్చింది. టెస్లా సంస్థ తమ సీఈవో అయిన ఎలాన్ మస్క్‌కు 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.83 లక్షల కోట్ల) విలువైన జీత ప్యాకేజీని ప్రతిపాదించింది. అయితే ఇది సాధారణ జీతం కాదు. పూర్తిగా పనితీరు ఆధారితమైనది. ఈ ప్యాకేజీని పొందాలంటే మస్క్ కొన్ని అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలి.

ముఖ్యమైన షరతులు ఇవే..
టెస్లా మార్కెట్ విలువను 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలి
సంవత్సరానికి 20 మిలియన్ల వాహనాలు డెలివరీ చేయాలి
10 లక్షల సెల్ఫ్ డ్రైవింగ్ రోబో టాక్సీలు ఉత్పత్తి చేయాలి
10 లక్షల హ్యూమనాయిడ్ ఏఐ బాట్స్ రూపొందించాలి
కనీసం 7.5 సంవత్సరాలు టెస్లాలో కొనసాగాలి
సీఈవో పదవికి వారసత్వ ప్రణాళిక రూపొందించాలి
ఈ ప్రతిపాదనను టెస్లా వాటాదారుల వార్షిక సమావేశంలో ఓటింగ్‌కు ఉంచనుంది. గతంలో డెలావేర్ కోర్టు కొట్టివేసిన 44.9 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఇది కొనసాగింపుగా వస్తోంది. భారత విస్తరణలో భాగంగా టెస్లా ఢిల్లీలో ఇటీవల రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. భారతీయ ఈవీ మార్కెట్‌లో మరింత లోతుగా ప్రవేశించేందుకు ఇది కీలక అడుగు.