భారత్‌లో టెస్లా తయారీ లేనట్లే! | Tesla unlikely to manufacture vehicles in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో టెస్లా తయారీ లేనట్లే!

Jun 2 2025 4:56 PM | Updated on Jun 2 2025 6:59 PM

Tesla unlikely to manufacture vehicles in India

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ టెస్లా తన కార్లను భారతదేశంలో తయారు చేసే అవకాశం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. కానీ, దేశంలో షోరూమ్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంపెనీ వాహనాలను భారత్‌లో విక్రయించేందుకు ఆసక్తిగా ఉందని చెప్పారు. అందుకోసం జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి టెస్లా నేరుగా దేశంలో వాహనాలను దిగుమతి చేసుకునే వీలుందని అంచనా వేశారు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో టెస్లా కార్లు తయారవుతాయని భావించిన వారికి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

కొత్త ఈవీ పాలసీ

భారత్‌లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో భాగంగా దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ప్రధాన అంతర్జాతీయ వాహన తయారీదారులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుంది. రాయిటర్స్ నివేదించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విధానాన్ని ఖరారు చేసింది. ఇది వాహన తయారీదారులకు కేవలం 15% దిగుమతి సుంకంతో 35,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ తక్కువ టారిఫ్‌లకు అర్హత పొందేందుకు కంపెనీలు దేశంలో తయారీ ప్లాంట్‌ను స్థాపించాల్సి ఉంటుంది. అందుకు 486 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉండాలి. నిర్ణీత గడువులోపు స్థానికంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం ప్రారంభించాలి.

దేశీయ వాహన తయారీదారులను అంతర్జాతీయ పోటీ నుంచి రక్షించడానికి భారత్‌లో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనుకునే వారు తమ ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల్లో కనీసం 25% మొదటి మూడేళ్లలో స్థానిక కంపెనీల నుంచే తీసుకోవాలి. క్రమంగా తర్వాత ఐదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలనే నిబంధనలున్నాయి. మెర్సిడెస్ బెంజ్, స్కోడా, ఫోక్స్ వ్యాగన్, హ్యుందాయ్, కియా వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు.

భారత్‌లో టెస్లా ప్రణాళికలు

టెస్లా ఇప్పటికే ముంబయి, ఢిల్లీలో రెండు షోరూమ్‌లను ఖరారు చేసింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో 4,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని సిద్ధం చేస్తుంది. టెస్లా ఈ ప్రాంతంలో అత్యధిక నెలవారీ లీజు రేట్లతో ఈ స్థాలాన్ని దక్కించుకుంది. నెలకు సుమారు రూ.35 లక్షలు (చదరపు అడుగుకు సుమారు రూ.900) చెల్లించడానికి సిద్ధమైంది. ఐదేళ్ల కాలపరిమితితో లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ మరో విస్తరణ చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్‌లో రెండో షోరూమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో తన మోడల్ 3, మోడల్ వై లను పరీక్షిస్తోంది. త్వరలో స్థానికంగా వీటిని ఆవిష్కరించేదుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండి: వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!

ట్రంప్‌కు భయపడ్డారా..?

ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ పాలసీను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా యూఎస్‌ కంపెనీలు స్థానికంగా అమెరికాలోనే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే చైనా, భారత్‌లో తయారీ సాగిస్తున్న యాపిల్‌ వంటి దిగ్గజ కంపెనీకి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ టెస్లా భారత్‌లో తయారీని ప్రారంభిస్తే ట్రంప్‌ తీవ్రంగా స్పందిస్తారని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలాన్‌మస్క్‌ ఎంత సన్నిహితుడైనా దేశ అభివృద్ధికి ఆటంకం కలిగితే మాత్రం ట్రంప్‌ ఊరుకోరని నిపుణులు చెబుతున్నారు. దాంతో రిస్క్‌ చేయడం ఎందుకనే భావనతో భారత్‌లో తయారీని వాయిదా వేసుకుంటున్నారా అనే అంచనాలు వెలువడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement