
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ.. టెస్లా జూలై మధ్యలో భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించింది. అప్పటి నుంచి కంపెనీ కేవలం 600 కార్లకు మాత్రమే ఆర్డర్లు పొందింది. అయితే కంపెనీ ఈ ఏడాది 350 నుంచి 500 కార్లను మాత్రమే ఇండియాలో విక్రయించాలని చూస్తోంది. టెస్లా మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో షాంఘై నుంచి రానుంది.
టెస్లా కంపెనీ ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్ నగరాల్లో మాత్రమే తమ మొదటి డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించనుంది. ఇప్పటికే సంస్థ దేశంలో రెండు డీలర్షిప్లను ప్రారంభించింది. ఛార్జింగ్ స్టేటన్స్ కూడా ఏర్పాటు చేయడంలో టెస్లా నిమగ్నమై ఉంది.
టెస్లా మోడల్ వై
టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారు
స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.